TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Published on: Tue Apr 14, 2026 4:11PM

 

 

ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లో క్వాంటం రంగంలో నూతన అధ్యాయం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని అమరావతిలో ప్రారంభించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీతో పాటు, గన్నవరం మేధా టవర్స్‌లోని 1క్యూ క్వాంటం ఫెసిలిటీని సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ రెండు క్వాంటం టెస్ట్‌బెడ్స్‌ను జాతికి అంకితం చేశారు.

ఈ టెస్ట్‌బెడ్స్ ద్వారా క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాలను పరీక్షించే సదుపాయం లభించనుంది. దీంతో దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహకారంతో ఈ ప్రాజెక్ట్ అమలు చేయబడింది. క్వాంటం కంప్యూటర్ హార్డ్‌వేర్‌ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్థ్యాన్ని అమరావతి క్వాంటం వ్యాలీ పొందింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, మేధా టవర్స్‌లో ఏర్పాటు చేసిన ఈ క్వాంటం టెస్ట్‌బెడ్స్ మైనస్ 273 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద పనిచేసే అత్యాధునిక సదుపాయాలతో రూపొందించబడ్డాయి.

క్వాంటం ఉపకరణాలు తయారు చేసే కంపెనీలు, పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులకు ఇవి ఎంతో ఉపయోగపడనున్నాయి.ఈ కార్యక్రమానికి నేషనల్ క్వాంటం మిషన్, డీఎస్టీ ప్రతినిధులు, ఐఐటీ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, క్వాంటం ఇన్నోవేషన్ స్టార్టప్‌ల ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్లు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్సిటీలు, కాలేజీల నుంచి సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులు వర్చువల్‌గా వీక్షించారు.