రామచంద్రాపురంలో దేశం అభ్యర్థికి అనుకూల పవనాలు?
Published on: Sat May 12, 2012 9:45AM
రామచంద్రాపురం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులు, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థి, తాజా మాజీ పిల్లి సుభాష్ చంద్రబోస్, తెలుగుదేశం పార్టీ తరపున చిక్కాల రామచంద్రరావులతో పాటు ఇండిపెండెంట్ గా ఇటీవల తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్ గురైన సూర్యనారాయణ పోటీలో వున్నారు. నామినేషన్ల ముందువర కు పోటీ ప్రధానంగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య వుంటుందని భావించారు. అయితే ఊహించినదానికి భిన్నంగా తెలుగుదేశంపార్టీ తరపున మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పోటీకి దిగడంతో పాటు తెలుగుదేశంపార్టీ రెబల్ అభ్యర్థి సూర్యనారాయణ రంగంలోకి దిగారు. ఈ నియోజకవర్గంలో కాపులతో పాటు శెట్టిబలిజ ఓటర్ల సమాఖ్య ఎక్కువగా వుంటుంది. అందువల్లనే ఈ స్థానం నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన అభ్యర్థి లేదా శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థి విజయం సాధించడం ఆనవాయితీగా వుంది.
పోటీలో వున్న అభ్యర్థులలో చిక్కాల రామచాద్రరావు, తోట త్రిమూర్తులు కాపు సామాజికవర్గానికి చెందినవారుకాగా, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్, దేశం రెబల్ అభ్యర్థి సూర్యనారాయణ శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందినవారు. ఇటీవల వరకు కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీ అభ్యర్థులు ఇరువురూ కాపు సామాజికవర్గానికి చెందినవారు కావడం, చిక్కాల రామచంద్రరావు పట్ల ప్రజలలో మంచి అభిప్రాయం వుండటం వల్ల కాపు సామాజికవర్గం ఓటు చీలిపోతుందని, ఈ స్థితిలో శెట్టిబలిజ వర్గానికి సుభాష్ చంద్రబోస్ విజయం సాధించే అవకాశం వుందని భావించారు. అయితే ఊహించని రీతిలో శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన సూర్యనారాయణ కూడా ఇండిపెండెంట్ గా రంగంలోకి రావడంతో ఈ సామాజికవర్గం ఓటింగ్ లో కూడా చీలిక వస్తుందని భావిస్తున్నారు. దాంతో ఈ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ అనివార్యం కాబోతుంది. శెట్టిబలిజ వర్గం ఒతులో చీలిక ఎక్కువగా వుండే పక్షంలో ఫలితాలు తారుమారు అవుతాయని, దాంతో తెలుగుదేశంపార్టీ అభ్యర్థి విజయం సాధించినా ఆశ్చర్యం వుండదని భావిస్తున్నారు.


