నానిపై పోటీకి సిద్ధమంటున్న పవన్ కళ్యాణ్ ఫ్రెండ్!!

 

2014 ఎన్నికల్లో టీడీపీ నుండి విజయవాడ ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన ప్రముఖ వ్యాపార వేత్త పీవీపీ ఈసారి కూడా టీడీపీ నుండి టికెట్ వచ్చే అవకాశం లేదని తెలియడంతో వైసీపీ వైపు చూస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతిచ్చారు. ఆ సమయంలో పవన్ ద్వారా టికెట్ కోసం లాబీయింగ్ చేసినా చంద్రబాబు పీవీపీకి టికెట్ ఇవ్వడానికి ఆసక్తి చూపించలేదు. కేశినేని నానికి టికెట్ హామీ ఇచ్చిన నేపథ్యంలో పీవీపీ విషయంలో చంద్రబాబు పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు పవన్ టీడీపీకి దూరమయ్యారు. అదీగాక చంద్రబాబు ఈసారి కూడా పీవీపీకి టికెట్ ఇచ్చే అవకాశం లేదు. దీంతో పీవీపీ తన రూటు మార్చుకొని వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోలా పవన్ తో పెద్దగా సంబంధాలు లేని కారణంగా పీవీపీ జనసేన పార్టీ నుండి టికెట్ ఆశించట్లేదని సమాచారం. అదీగాక జనసేన కంటే వైసీపీ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువుంటాయని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. పీవీపీ వైసీపీ నుండి విజయవాడ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై జగన్ తో మంతనాలు జరపగా.. జగన్ ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. పీవీపీ వైసీపీలో చేరడానికి ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 14న జగన్ సమక్షంలో పీవీపీ వైసిపి కండువా కప్పుకోబోతున్నారని సమాచారం. ఎంపీగా పోటీ చేయాలన్న పీవీపీ కల వైసీపీ ద్వారా నెరవేరేలా ఉంది. మరి పీవీపీ టీడీపీ ఎంపీ కేశినేని నానికి ఏ మేరకు పోటీ ఇస్తారో చూడాలి.