శాతవాహనులను తెలుగువారన్న పరబ్రహ్మ శాస్త్రి ఇకలేరు

ఉత్తరాది రాజులుగా పరిగణింపబడుతున్న శాతవాహనులను తెలుగువారిగా నిరూపించే శాసనాలను వెలికితీసిన ప్రఖ్యాత చరిత్రకారులు డాక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి కన్నుమూశారు. బ్రెయిన్ హేమరేజ్‌కు గురైన ఆయన హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం 5.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. పీవీ పరబ్రహ్మ శాస్త్రి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో పుచ్చా వెంకటేశ్వర్లు, రుక్మిణమ్మ దంపతులకు 1921 జూన్‌లో జన్మించారు.

 

బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి సంస్కృతంలో డిగ్రీ పొందిన ఆయన 1959లో డిపార్ట్‌మెంట్ ఆప్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంలో ఎపిగ్రఫీ అసిస్టెంట్ ఉద్యోగంలో చేరారు. తెలుగునాట ఎన్నో శాసనాలను వెలికి తీసి, మరుగున పడుతున్న చరిత్రను వెలుగులోకి తెచ్చారు. కాకతీయుల చరిత్రను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు, ఎన్నో శాసనాల సారాంశాన్ని వివరించారు. ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖలో 25 సంవత్సరాలపాటు సేవలందించిన శాస్త్రిగారు 2 వేలకు పైగా శాసనాలను పరిష్కరించారు. ఆయన చేసిన సేవలకు గానూ కర్నాటక విశ్వవిద్యాలయం డాక్టరేట్‌తో సత్కరించింది. ఆయన మరణం పట్ల ఆంధ్రప్రదేశ్,తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లు సంతాపం ప్రకటించారు.