ఒంటిమిట్టలో కన్నులపండువగా పుష్పయాగం
Published on: Mon Apr 6, 2026 9:30AM

చారిత్రక ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం ఆదివారం (ఏప్రిల్ 5) భక్తి సాగరంలో మునిగితేలింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల అనంతరం నిర్వహించే పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. రంగురంగుల పుష్పాలు, సుగంధ పరిమళాల మధ్య సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులు భక్తులకు కనువిందు చేశాయి.
ఈ వేడుక కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వివిధ ప్రాంతాల నుండి సేకరించిన సుమారు 3 టన్నుల బరువు గల 12 రకాల పుష్పాలను, 6 రకాల పత్రాలను ఈ యాగం కోసం వినియోగించారు. మల్లె, కనకాంబరం, రోజా, చామంతి వంటి సుగంధ పుష్పాలతో పాటు తులసి వంటి పవిత్ర పత్రాలతో స్వామివారికి పుష్ప నీరాజనం సమర్పించారు. గంటల తరబడి సాగిన ఈ పుష్పాభిషేకం చూసి భక్తులు పులకించిపోయారు.
లోక క్షేమం కోసం ప్రార్థిస్తూ ఈ యాగం నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో నిత్య కైంకర్యాలలో ఏవైనా లోపాలు జరిగి ఉంటే, వాటికి ప్రాయశ్చిత్తంగా ఈ పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఎస్వీబీసీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. కాగా ఈ వేడుకను వీక్షించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.


