తగ్గేదేలే.. పుష్ఫ స్టైల్ స్మగ్లింగ్.. ట్రక్కు కింద ఎర్రచందనం.. కట్‌చేస్తే...
Published on: Fri Feb 4, 2022 10:45AM
పుష్ఫ సినిమా చూసే ఉంటారుగా. పాన్ ఇండియా వైజ్ బ్లాక్‌బస్టర్ మూవీ. అందులో హీరో బన్నీ.. అటవీ సిబ్బంది కంట పడకుండా.. ఎర్రచందనం దుంగలను చాకచక్యంగా చెక్‌పోస్టులు దాటిస్తుంటాడు. పాల వ్యాన్ అడుగున రెడ్ సాండల్ సరుకు ఉంచి.. పైన పాలు పోసి.. బురిడీ కొట్టిస్తుంటాడు. ఆ సీన్ సినిమాలో పుష్పకి బాగా వర్కవుట్ అయింది. సేమ్ టు సేమ్.. అవే సీన్లను కాపీ కొట్టి.. తాను సైతం పుష్పలా డాన్ అవ్వాలనుకున్నాడు ఓ ట్రక్ డ్రైవర్. కానీ, పోలీసులు సైతం పుష్ప మూవీ చూసుంటారనే లాజిక్ మిస్ అయ్యాడు. ఖాకీలకు అడ్డంగా దొరికిపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే...
యాసిన్ ఇనయాతుల్లా. ట్రక్కు డ్రైవర్. పుష్ప సినిమా చూసి బాగా ఇన్‌స్పైర్ అయినట్టున్నాడు. తాను సైతం తన ట్రక్కులో ఎర్రచందనం దుంగలను సరిహద్దులు దాటించాలని స్కెచ్ వేశాడు. కర్ణాటక-ఆంధ్ర సరిహద్దు ప్రాంతం నుంచి మహారాష్ట్రకు వెళ్లే మార్గంలో అక్రమంగా ఎర్ర చందనాన్ని తరలించే ప్రయత్నం చేశాడు. అచ్చం.. పుష్ప మూవీలో పాల వ్యాను తరహాలో.. ట్రక్కులో కింది భాగంలో ఎర్ర చందనం దుంగల్ని పెట్టి.. ఎవరికీ అనుమానం రాకుండా దుంగలపై పండ్లు, కూరగాయాల డబ్బాలను ఉంచాడు. మరింత స్మార్ట్‌గా ఆలోచించి.. ట్రక్కుకు ‘కొవిడ్ - 19, నిత్యావసర ఉత్పత్తులు’ అని బ్యానర్ కూడా రాయించాడు.
మనోడి ప్లాన్ మొదట్లో బాగానే వర్కవుట్ అయింది. ఏపీ పోలీసుల పనితీరు గురించి చెప్పేదేముంది.. వారికి ఎలాంటి అనుమానం రాలేదు.. అలా ఈజీగా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని చెక్ పోస్టులను తప్పించుకొని మహారాష్ట్రకు చేరుకున్నాడు. కానీ, మరాఠా పోలీసులకు మాత్రం అడ్డంగా దొరికిపోయాడు. సంగ్లీ జిల్లాలోని గాంధీ చౌక్ పోస్ట్ దగ్గరకు రాగానే అక్కడి పోలీసులు ట్రక్కును అడ్డుకొని తనిఖీ చేయగా అసలు బండారం బయటపడింది.
పోలీసులు డ్రైవర్ యాసిన్‌ను అరెస్ట్ చేసి.. ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 2.45 కోట్లు ఉంటుందని అంచనా. బహుషా మహారాష్ట్ర పోలీసులు పుష్ప హిందీ వర్షన్ చూసినట్టున్నారు. అందుకే, బాలీవుడ్‌లో మూవీ బాగా హిట్ అయినట్టే.. అక్కడి పోలీసులూ ఆ సీన్లకు ఫిదా అయి.. రియల్ పుష్పను అరెస్ట్ చేశారు. మరి, మన ఏపీ పోలీసులు పుష్పను ఎందుకు పట్టుకోలేకపోయారో..? సినిమాలో మాదిరే.. వారికి ముట్టాల్సింది ముట్టిందేమో..? అంటున్నారు.


