కేంద్రం ఎంట్రీ.. కేసీఆర్, జగన్ ల డ్రీమ్ ప్రాజెక్ట్ డౌటేనా?

 

గోదావ‌రి జలాల‌ను శ్రీశైలానికి త‌ర‌లించాల‌ని, త‌ద్వారా తెలంగాణ‌ ఏపీ రాష్ట్రాల‌కు అద‌నంగా నీటిని వినియోగించుకునే అవ‌కాశం ఉంటుంద‌నే ప్ర‌తిపాద‌న సూత్ర‌ప్రాయంగా తెరమీదికి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. సీఎంలు కేసీఆర్‌, జ‌గ‌న్ ఓ ద‌ఫా స‌మావేశ‌మై ఈ ప్రాజెక్టుపై చ‌ర్చించారు. ప్రస్తుతం అధికారుల స్థాయిలో చ‌ర్చ‌ల ప్ర‌క్రియ జ‌రుగుతోంది. అయితే, న‌దీ జ‌లాల పంప‌కం అనేది ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణ‌యించుకుంటే స‌రిపోతుందా, కేంద్రం జోక్యం ఉంటుంది క‌దా అనే సందేహాలు మొద‌ట్నుంచీ వ్య‌క్త‌మౌతున్నాయి. కాగా ఈ విషయంపై ఏపీ బీజేపీ నాయ‌కురాలు ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి తాజాగా స్పందించారు. న‌దీ జ‌లాల పంప‌కం అనేది ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చుని మాట్లాడేసి నిర్ణ‌యాలు తీసుకుంటే స‌రిపోద‌ని పురంధేశ్వ‌రి వ్యాఖ్యానించారు. న‌దీ జ‌లాల పంప‌కం అనేది ఎప్పుడో జ‌రిగిపోయిన వ్య‌వ‌హార‌మ‌ని, దీనిపై ఇప్పుడు కొత్త‌గా చ‌ర్చ‌లు పెట్ట‌డం స‌రికాదన్నారు. తెలంగాణ‌, ఏపీల మ‌ధ్య కూడా ట్రిబ్యున‌ల్ ద్వారా నీటి పంపకాలు ఎప్పుడో ప‌క్కాగా జ‌రిగిపోయాయ‌న్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో గోదావ‌రి న‌దీ జ‌లాల‌ను పంప‌కం చేయాలంటే ప్ర‌జాభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంద‌నీ, ప‌రీవాహ‌క ప్రాంతాల్లోని రైతుల అభిప్రాయాల‌కు ప్రాధాన్య‌త క‌ల్పించాల్సి ఉంటుంద‌ని వీటిపై సీఎం జ‌గ‌న్ దృష్టి సారించాల‌న్నారు. ఇది కేవ‌లం రెండు రాష్ట్రాల‌కు సంబంధించి వ్య‌వ‌హారంగా చూడ‌కూడ‌ద‌న్నారు. మొత్తానికి సీఎంలు ఇద్దరూ డ్రీమ్ ప్రాజెక్టు అనుకుంటున్న గోదావ‌రి జ‌లాల త‌ర‌లింపు వ్య‌వ‌హారంలోకి కేంద్రం ఎంట్రీ ఉంటుంద‌నేది పురంధేశ్వ‌రి చెప్ప‌‌క‌నే చెప్పారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.