మోడీనే దిగొచ్చారు. ఎవరిని బెదిరిస్తున్నారు మేడమ్...

 

టీడీపీ, బీజేపీ మిత్రపక్షం అని అందరికీ తెలుసు. పైకి మిత్రపక్షంగా ఉన్నా... రెండు పార్టీల మధ్య లోలోపల ఉన్న అంతర్గతాలు కూడా అందరికీ తెలిసినవే. దేశంలో తమ పార్టీనే అధికారంలో ఉందని...ఇక ఉత్తర భారతదేశంలో కూడా తమ పార్టీదే హవా అని ఇక్కడ ఏపీలో ఉన్న కొంత మంది బీజేపీ నేతలు రెచ్చిపోయి టీడీపీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. మరి ఏదో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఏపీలో ఆ నాలుగు సీట్లయినా వచ్చినయి అని నమ్మే టీడీపీ బీజేపీ చేస్తున్న కామెంట్లు విని తట్టుకుంటుందా.. అందుకే అప్పుడప్పుడు ఆ పార్టీ నేతలు కూడా రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. ఇక సోము వీర్రాజు లాంటి వాళ్లయితే ఒక మెట్టు పైకి ఎక్కి...అదెంటో తమ పార్టీ సపోర్ట్ లేకపోతే టీడీపీ పార్టీయే లేదు అన్నరేంజ్ లో కోతలు కోస్తూ మాట్లాడుతుంటారు. ఇప్పుడు కేంద్ర మాజీ మంత్రి, బిజెపి మహిళా మోర్చా అద్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఆ పాటే పాడటం విచిత్రంగా ఉంది.

 

పురందేశ్వరి టీడీపీపై, ముఖ్యంగా చంద్రబాబుపై విమర్శలు చేయడం కొత్తేమి కాదు. గతంలో ఎన్నోసార్లు చంద్రబాబుపై, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సీరియస్ అవుతూనే ఉంటారు. అలాగే ఇప్పుడు తాజాగా.. తెలుగు దేశంపై విమర్శలు గుప్పించారు. ఓ రకంగా చెప్పాలంటే బెదిరింపు వ్యాఖ్యలే చేశారు. కేంద్రం ఇస్తున్న నిదులతోనే రాష్ట్ర ప్రభుత్వం వివిధ పధకాలను అమలు చేస్తోందని.. కాని ప్రభుత్వపరంగా తమకు ఈ పదకాలు అందించడం లేదని చెబుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఆమె చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పులను కేంద్రంపై నెట్టే యత్నం చేస్తున్నారని ఆమె విమర్శించారు. అంతేనా... మిత్రపక్షం వైఖరి మార్చుకోకుంటే తమ సామర్ద్యం బట్టి అన్ని స్థానాలలో పోటీచేస్తామని హెచ్చరించారు. అయితే ఇక్కడే పురందేశ్వరి మాటలు చాలా కామెడీగా ఉన్నాయి అంటున్నారు.

 

ఎందుకంటే.. ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంతో అందరికీ తెలుసు. ఏదో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ నాలుగు సీట్లు వచ్చాయి. లేకపోతే ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో... బీజేపీ పరిస్థితి కూడా అంతే. ఏదో కాలం బావుండి..యూపీఏ ప్రభుత్వ తీరుపై విసిగిపోయిన జనాలు.. ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం గట్టారు. ఇక ఆ తరువాత నార్త్ ఇండియాలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీనే అధికారం చేపట్టింది. కానీ రాను రాను పరిస్థితులు మారాయి. నాలుగేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. బీజేపీపై, ముఖ్యంగా మోడీపై వ్యతిరేకత పెరిగింది. దానికి నిదర్శనం గుజరాత్ ఎన్నికల ఫలితాలే కారణం. ఇక మోడీ కూడా ముందున్న జోష్ మీద లేరు. మొదట్లో మిత్రపక్షమైన టీడీపీపైన, చంద్రబాబుపైన మోడీ చిన్నచూపు ఉండేది. అంతేకాదు వైసీపీతో పొత్తుకు కూడా రెడీ అయినట్టు వార్తలు వచ్చాయి. కానీ నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి, టీడీపీ సత్తా ఎంటో అర్ధమైంది. అందుకే మోడీ కాస్త వెనక్కి తగ్గారు. ఇక గుజరాత్ ఎన్నికల తరువాత మోడీకు ఉన్న క్రేజ్ మరింత తగ్గింది అని చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మోడీనే ఆలోచించి మాట్లాడుతున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. విభ‌జ‌న చ‌ట్టంలోని హామీలు నెర‌వేర్చాల‌ని కోరుతూ ఏపీ టీడీపీ, బీజేపీ ఎంపీలు ప్ర‌ధాని మోడీని కలిశారు. ఈ సమయంలో..అసలు ఒకప్పుడు చంద్రబాబుకు అపాయింట్ మెంటే ఇవ్వని మోడీ..  రెండు, మూడు రోజుల్లో తాను, చంద్ర‌బాబు భేటీ అవుతామ‌ని టీడీపీ ఎంపీలకు స్వ‌యంగా తానే చెప్పి షాక్ ఇచ్చారు. దీన్ని బట్టి పరిస్థితి ఏంటో అర్ధమయ్యే ఉంటది. మోడీ అంతటి వారే దిగొచ్చారు.

 

కానీ పురందరేశ్వరి మాత్రం ఏదో టీడీపీకి బీజేపీయే దిక్కు అన్నట్టు మాట్లాడుతున్నారు. దీంతో.. పురందరేశ్వరి గారు ఎవరిని బెదిరిస్తున్నారు అని అనుకుంటున్నారు. గట్టిగా 20 స్థానాల్లో కుడా ఆ పార్టీకి అభ్యర్థులు లేరు... ఇదే పురందేశ్వరి గారు రాజంపేట పార్లమెంట్ కు పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన సంగతి ఎవరు మర్చిపోలేరుగా. ఇప్పుడు ఎవరిని బెదిరిస్తున్నట్టు? బెదిరిస్తే మాత్రం బెదిరే పరిస్థితి ఉందా? ఇలాంటి అర్ధం పర్ధంలేని బెదిరింపులు మానేస్తే పార్టీకి చాలా మంచిది అని అంటున్నారు.