ఆప్ హిట్.. కాంగ్రెస్ ఫట్.. బీజేపీ ఫసక్.. పంజాబ్‌లో ఏం జరిగింది?
Published on: Thu Mar 10, 2022 11:06AM
117 స్థానాలున్న చిన్న రాష్ట్రం. ఢిల్లీ పక్కనే.. యూపీ చెంతనే.. ఉన్న స్టేట్. కేంద్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయలేకున్నా.. పాలిటిక్స్‌లో కీలక పరిణామాలకు వేదికైంది పంజాబ్. అవును, పంజాబ్ ఫలితాలను ఉత్తి ఆ రాష్ట్ర ఎన్నికలలానే చూసే పరిస్థితి లేదు. చిన్న రాష్ట్రమైనా.. పెద్ద మెసేజే ఇచ్చింది. కాంగ్రెస్‌కు ఇక దేశంలో భవిష్యత్తు లేదని తేల్చి చెప్పింది. ప్రజా వ్యతిరేక పాలన చేస్తే.. బీజేపీకీ గుణపాఠం చెబుతామని స్పష్టం చేసింది. సామాన్యులను మంచి చేసే ప్రభుత్వాన్నే ఎన్నుకుంటామని మంచి మెసేజ్ ఇచ్చింది. అందుకే, పంజాబ్ ఫలితాలపై యావత్ దేశం దృష్టి సారించింది.
పంజాబ్‌లో అనూహ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు దిశగా దూసుకెళ్లింది. ఈ ఫలితాలు మనకు అనూహ్యమేమో కానీ.. ఉత్తరాది వారు ఊహించిందే. పంజాబ్‌లో అధికార కాంగ్రెస్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు ఓటర్లు. ఈ ఓటమి హస్తం పార్టీ స్వయంకృతాపరాధమే. కాంగ్రెస్ కురవృద్ధుడు కెప్టెన్ అమరేందర్‌సింగ్ పార్టీని వీడటం కోలుకోలేని దెబ్బ. సిద్ధూతో విభేదాలతో కెప్టెన్ రిటైర్డ్‌హర్ట్ అయ్యారు. మరి, సిద్ధూనైనా పంజాబ్ కాంగ్రెస్ కెప్టెన్ చేశారా? అంటే అదీ లేదు. కుల రాజకీయాల్లో ఆరితేరిన కాంగ్రెస్.. చన్నీ అనే ఫేస్ వాల్యూ లేని లీడర్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. ఈసారి చన్నీ-సిద్ధూల మధ్య కోల్డ్‌వార్ కంటిన్యూ అయింది. వాళ్లలో వాళ్లు కొట్టుకుంటే.. ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీని బండకేసి బాదేశారు. అధికార పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు.
ఇక, ఊహించినట్టే బీజేపీకి దిమ్మతిరిగే షాక్. మూడు వ్యవసాయ చట్టాలపై కేంద్రంపై, బీజేపీపై పోరాడిందంతా పంజాబ్ రైతులే. ఢిల్లీలో నెలల తరబడి ఉద్యమం చేసినా.. మోదీ దిగిరాకపోవడం.. చివరాఖరికి సారీ చెప్పి, ఆ చట్టాలు విత్‌డ్రా చేసుకున్నా.. అప్పటికే జరిగిన నష్టం జరిగిపోయింది. పంజాబ్ రైతుల కడుపుమంట.. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అదంతా ఈవీఎంలపై చూపించారు. బీజేపీని సింగిల్ డిజిట్‌కే పరిమితం చేశారు. అయితే, ఇక్కడో విషయం గుర్తు చేసుకోవాలి. గత ఎన్నికల్లో కూడా బీజేపీకి పెద్దగా సీట్లు వచ్చిందేమీ లేదు. అంటే, ఈసారి పంజాబ్‌లో బీజేపీకి అదనంగా జరిగిన నష్టం ఏమీ లేదు. కాకపోతే లాభపడలేదంతే. ఈ లెక్కన, పంజాబ్‌లో కమలనాథులకు నో గెయిన్.. నో లాస్.
ఇక, ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్య విజయం. ఇప్పటికే ఢిల్లీలో బ్రహ్మాండమైన విజయంతో, సీఎం కేజ్రీవాల్ సుపరిపాలనతో.. దేశ రాజధానిలో చీపురు పార్టీ ప్రజల ఆదరణ చూరగొంది. అప్పులేని రాష్ట్రంగా, అవినీతి లేకుండా ప్రజల దగ్గరికే పాలనతో.. ఉచిత నీరు, ఉచిత కరెంట్‌తో.. ఆప్ అధినేత కేజ్రీవాల్ ఢిల్లీకి రారాజుగా వెలుగొందుతున్నారు. దేశంలో మోదీ తర్వాత క్లీన్ ఇమేజ్ ఉన్న లీడర్ ఆయనే. ఇక, ఆప్ పార్టీ తొలినాళ్ల నుంచీ.. ఢిల్లీతో పాటు పంజాబ్‌లోనే ఆమ్ ఆద్మీలకు ఆదరణ ఉంది. గత ఎన్నికల్లోనూ కేజ్రీవాల్.. పంజాబ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈసారి మరింత పకడ్బందీగా పావులు కదిపారు. ఢిల్లీలో కేజ్రీవాల్ పాలనకు.. పంజాబ్ వాసులు ఫిదా అయ్యారు. ఆయన పార్టీ ఆప్‌కు ఆకర్షితులయ్యారు. అయితే, ఆప్ క్రేజ్ కంటే.. కాంగ్రెస్‌పై విసుగు, అసంతృప్తి.. బీజేపీపై ఆగ్రహం, కడుపుమంటే.. పంజాబ్ ఓటర్లను ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపిందని చెబుతున్నారు. అందుకే, పంజాబ్‌లో ఆప్ గెలిచింది అని అనడంకంటే.. కాంగ్రెస్, బీజేపీ ఓడాయని చెప్పడం సమంజసం అంటున్నారు.


