పంజాబ్ ఎన్నికలు వాయిదా.. మరి, యూపీలో?
Published on: Mon Jan 17, 2022 2:07PM
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అధికార కాంగ్రెస్‌తో పాటు పలు రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు గతంలో ప్రకటించిన షెడ్యూల్‌లో మార్పులు చేసింది. ఫిబ్రవరి 14న ఒకే విడతలో జరగాల్సిన పోలింగ్‌ను ఆరు రోజుల పాటు వాయిదా వేసింది. ఫిబ్రవరి 20న పంజాబ్‌లో ఎలక్షన్స్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది ఈసీ.
పంజాబ్‌లో ఎన్నికలు వేయిదా వేసిన ఎలక్షన్ కమిషన్.. ఉత్తర ప్రదేశ్‌తో సహా మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల వాయిదాపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అంటే, ఆయా స్టేట్స్‌లో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్స్ జరగనున్నాయి.
ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు గురు రవిదాస్ జయంతి వేడుకలు ఉండటంతో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని మార్చాలని అధికార కాంగ్రెస్ సహా అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. అయితే, ఈసీ ఇటీవల ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. పంజాబ్‌లో ఫిబ్రవరి 14న ఒకే విడతలో పోలింగ్ జరగాల్సి ఉంది. కానీ, ఫిబ్రవరి 16న యూపీలోని బెనారస్‌లో గురు రవిదాస్ జయంతి ఉత్సవాలు ఉన్నాయి. ఆ సమయంలో లక్షలాది మంది భక్తులు పంజాబ్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి తరలి వెళ్తుంటారు. వారంతా ఓటు వేసే అవకాశం కోల్పోతారని పార్టీలు ఈసీకి విన్నవించాయి.
ఈ నేపథ్యంలో పోలింగ్ తేదీని వారం పాటు వాయిదా వేయాలని పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ విజ్ఞప్తి చేశారు. ప్రధాన పార్టీలైన బీఎస్పీ, బీజేపీ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో.. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల పోలింగ్ తేదీని ఫిబ్రవరి 20కి మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది.


