చుక్కలమందుకు అవినీతి చెద
Published on: Sat Feb 18, 2012 2:45PM
చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పల్స్ పోలియో
తెలుగువన్.కామ్ స్పెషల్ స్టోరీ
హైదరాబా
ద్: 'నిండుజీవితానికి రెండు చుక్కలు'... ఇది పల్స్ పోలియో కార్యక్రమ నినాదం. అయితే ఈ బృహత్తర కార్యక్రమానికి కూడా అవినీతి చెదపట్టింది. దీనికి తోడు నిర్లక్ష్యం కూడా ముదిరింది. ఫలితంగా పలువురు చిన్నారుల ప్రాణాలు ఇప్పటికే గాల్లో కలిసిపోయాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చుక్కల మందును గడప గడపకు తీసుకువెళ్ళు క్యారియర్లు సరిగా లేకపోయినా, ముందును నిలువచేసే కోల్డ్ బాక్సులు, ఐస్ బెడ్ లు అరకొరగా ఉన్నా ఆ మందు నిరుపయోగంగా మారుతుంది. ఇటువంటి మందు పిల్లలకు ఇస్తే వారు అనారోగ్యం పాలవుతారు. ఈ కార్యక్రమానికి సగటున ఒక్కో కేంద్రానికి 5 వేల క్యారియర్లు ఉండాలి. అయితే అందులో సగం కూడా ఏ కేంద్రం వద్ద లేవు. ఇవన్నీ మూడేళ్ళ క్రిందట పంపిణీ చేసినవే. వీటిలో చాలా క్యారియర్లు పై మూతలు పోవటం, ఎలుకలు కొరికేయటం, పగిలిపోవడందో పనికి రానివిగా మారాయి. వీటి మరమ్మత్తులకు నిధులు లేవు. కోల్డ్ బాక్సులు, ఐస్ బెడ్ ల కొరత కూడా తీవ్రంగా ఉంది. దీనికి తోడు అవినీతి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేస్తోంది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్ల పరిధిలో ప్రచారానికి రూ.2000 చొప్పున కేటాయిస్తున్నారు. అయితే చాలాచోట్ల ప్రచారం నిర్వహించిన దాఖలాలు కనిపించడం లేదు. నిధులు మాత్రం ఖర్చయి పోతున్నాయి. పల్స్ పోలియో కేంద్రం పరిధిలో నాలుగు టీమ్ లు మూడు రోజుల సొమ్మును స్వాహా చేస్తున్నారని సమాచారం. పోలియో వ్యాక్సిన్ ను భద్రపరిచేందుకు అవసరమైన ఐస్ కొనుగోలుకు ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి రూ.3000 ఇస్తారు. అయితే చాలాచోట్ల ఐస్ కు బదులు వాటర్ ప్యాకెట్లను రిఫ్రిజిరేటర్లలో ఉంచి గడ్డ కట్టాక వాటిని ఐస్ లా ఉపయోగించి నిధులు కాజేస్తున్నారు. మొబైల్ బృందాలు మూడురోజుల పాటు సంబంధిత ఆరోగ్యక్రేంద్రాల పరిధిలో తోటల్లో ఉండేసరికి, సంచార జీవులు, పూసలు, బొమ్మల కులాల వారి పిల్లలను గుర్తించు వ్యాక్సిన్ వేయాలి. వీటికోసం రోజుకు రూ.2500 కేటాయిస్తారు. ఈ నిధులు కూడా చాలావరకు దుర్వినియోగం అవుతున్నాయి. పర్యవేక్షకులు తిరిగేందుకు ఏర్పాటుచేసిన ఆటోఅద్దె నిమిత్తం రోజుకు రూ.650 ఇస్తారు. ఈ ఆటో మూడురోజుల పాటు పర్యటించాలి. చాలాచోట్ల తొలిరోజు మాత్రమే తిరిగి మిగతా రెండురోజుల సొమ్మును నకిలీ బిల్లులతో స్వాహా చేస్తున్నారు. ఈ విధంగా ఒక మంచి కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగా నిరుపయోగంగా మారే పరిస్థితి ఏర్పడింది.


