వైఎస్ వివేకా హత్య కేసు గురించి కీలక ప్రకటన!!

 

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి నెలలు గడుస్తున్నా ఇంతవరకు దోషులు ఎవరన్నది స్పష్టత రాలేదు. అయితే తాజాగా పులివెందుల డీఎస్పీ వాసుదేవన్‌ వ్యాఖ్యలు చూస్తుంటే.. ఈ కేసును ఛేదించడానికి పోలీసులకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశముందనిపిస్తోంది.

సోమవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వాసుదేవన్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 15న వైఎస్‌ వివేకా దారుణహత్యకు గురయ్యారన్నారు. ఆ కేసును ఛేదించడం పెద్ద సవాలుగా నిలిచిందన్నారు. ఎంతటి సవాలునైనా స్వీకరించి ఛేదిస్తామన్నారు. కేసు విచారణలో పక్కాప్రణాళికతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ప్రజలకు గాని, పోలీసు సిబ్బందికి గాని హత్యకు సంబంధించి వివరాలు, ఆధారాలు తెలిసిఉంటే తమకు చెప్పాలన్నారు. వివరాలు చెప్పిన వారి సమాచారం గోప్యంగా ఉంచుతామన్నారు. సరైన ఆధారాలు చెప్పగలిగితే వారికి ఊహించని రివార్డు కూడా అందిస్తామన్నారు. ఈ కేసుపై ప్రత్యేక బృందం దర్యాప్తు ముమ్మరం చేసిందన్నారు. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 23 మంది ఎస్‌ఐలు పనిచేస్తున్నారన్నారు. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామన్నారు.