TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పూడి శ్రీహారి బెంగళూరులో అరెస్ట్

Published on: Thu Apr 30, 2026 10:21AM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా సంచలనం సృష్టిస్తున్న సోషల్ మీడియా కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీపీఆర్వోగా పనిచేసిన పూడి శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణల నేపథ్యంలో కుప్పం పోలీసులు ఈ చర్య చేపట్టారు. బెంగళూరులో ఉన్న శ్రీహరిని ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం ఏపీకి తరలించింది.

ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలోనూ..  ఆ తర్వాత కూడా వైసీపీ  సోషల్ మీడియా వేదికల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ..   పోస్టులు పెట్టారని, ముఖ్యంగా ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా ప్రదర్శించారని ఫిర్యాదులు అందాయి. చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన వినోద్ కుమారమూర్తి అనే వ్యక్తి ఈ వ్యవహారంపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, గత కొంతకాలంగా శ్రీహరి కోసం గాలింపు చేపట్టారు.

న్యాయపరంగా ఈ కేసులో ఊరట పొందేందుకు పూడి శ్రీహరి ప్రయత్నించినప్పటికీ,   న్యాయస్థానాల్లో ఆయనకు చుక్కెదురైంది. తన అరెస్టును ఆపాలంటూ ఆయన దాఖలు చేసుకున్న  ముందస్తు బెయిల్  పిటిషన్లను న్యాయస్థానాలు తిరస్కరించాయి.  మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, లేదా స్టే ఇచ్చేందుకు  సుప్రీం కోర్టు కూడా నిరాకరించడంతో..  పోలీసులకు ఆయనను అరెస్ట్ చేసేందుకు మార్గం సుగమమైంది.

అంతకుముందు ఈ కేసు విచారణలో భాగంగా కుప్పం కోర్టులో పలు ఆసక్తికర పరిణామాలు జరిగాయి. తొలుత శ్రీహరిని రిమాండ్‌కు పంపాలని పోలీసులు కోరగా, స్థానిక కోర్టు స్టేషన్ బెయిల్ మంజూరు చేసింది. అయితే.. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కుప్పం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించడమే కాకుండా, విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని శ్రీహరిని ఆదేశించింది. చివరకు అత్యున్నత న్యాయస్థానంలో కూడా ఎటువంటి ఉపశమనం లభించకపోవడంతో పోలీసులు తాజాగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో అరెస్టు చేసిన పూడి శ్రీహరిని గురువారం (ఏప్రిల్ 30) కుప్పం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా కుప్పం కోర్టు వద్దకు పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు.