వైఎస్ జగన్ ఏడాది పాలనపై ప్రజా తీర్పు

ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. అద్భుతంగా పాలించామని, ఒక్క ఏడాదిలోనే మేనిఫెస్టోలో చెప్పినవి 90 శాతం చేశామని, మేనిఫెస్టోలో చెప్పనవి కూడా ఎన్నో చేసి.. ప్రజా ప్రభుత్వం అనిపించుకున్నామని అధికార పార్టీ చెబుతోంది. అయితే, ప్రతిపక్షాలు మాత్రం.. జగన్ సర్కార్ ఒక్క ఏడాదిలోనే ప్రజలకు చుక్కలు చూపించిందని.. కూల్చివేతలు, కబ్జాలు, కోర్టు మొట్టికాయలు, మంత్రుల బూతులు తప్ప.. ఏడాదిలో జగన్ సర్కార్ సాధించింది ఏమి లేదని విమర్శిస్తున్నాయి. సరే అధికార పార్టీ గొప్పలు చెప్పుకోవడం, ప్రతిపక్షాలు విమర్శలు చేయడం కామన్. అసలు వైఎస్ జగన్ ఏడాది పాలన గురించి సామాన్య జనం ఏమనుకుంటున్నారు?. అది తెలుసుకోవడం కోసమే.. తెలుగు వన్ సంస్థ యూట్యూబ్ లో పోల్ నిర్వహించింది. ఈ పోల్ లో 50 వేల మందికి పైగా పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

"వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది పూర్తయింది. జగన్ ఏడాది పాలనపై మీరు సంతృప్తిగా ఉన్నారా?" అని తెలుగు వన్ పోల్ నిర్వహించగా.. 42 శాతం మంది జగన్ ఏడాది పాలనతో సంతృప్తిగా ఉన్నామన్నారు. అయితే, 58 శాతం మంది మాత్రం సంతృప్తిగా లేమని చెప్పారు. అంటే, జగన్ ఏడాది పాలన బాగుంది అన్నవారికంటే.. బాగాలేదు అన్నవారు 16 శాతం ఎక్కువగా ఉన్నారు.

ఇక ఈ పోల్ కి కామెంట్స్ కూడా పెద్ద సంఖ్యలో వచ్చాయి. అందులో జగన్ సర్కార్ ని మెచ్చిన కామెంట్స్ కొన్ని ఉంటే, తీవ్ర విమర్శలు చేసిన కామెంట్స్ ఎన్నో ఉన్నాయి. కొందరు జగన్ సర్కార్ ని ప్రజా ప్రభుత్వమని ప్రశంసించగా, కొందరు మాత్రం ప్రతీకార ప్రభుత్వమని విమర్శించారు. "రాజధాని లేదు, అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, పోలవరం ఆగిపోయింది, ఇసుక కొరత, న్యాయస్థానాలపై గౌరవం లేదు." అంటూ ప్రభుత్వ తీరుపై కొందరు విరుచుకుపడ్డారు. "ఒక్క శాతం కూడా సంతృప్తిగా లేము, త్వరగా జమిలి ఎన్నికలు వచ్చి వీలైనంత త్వరగా ఈ ప్రభుత్వం దిగిపోతే బాగుండు" అంటూ కొందరు కామెంట్స్
చేశారు. వరస్ట్ సీఎం.. తుగ్లక్ చర్యలు.. క్యాస్ట్ ఫీలింగ్ లేని రాజకీయం ఎప్పుడొస్తుందో?.. అంటూ ఇలా రకరకాలుగా కామెంట్స్ దర్శనమిచ్చాయి. మొత్తానికి తెలుగు వన్ నిర్వహించిన పోల్ లో జగన్ ఏడాది పాలనకి లైక్ కొట్టినవారికంటే, డిస్ లైక్ కొట్టినవారే ఎక్కువ ఉన్నారు.