TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప‌బ్ డ్ర‌గ్స్ కేసులో నిహారిక, రాహుల్‌ సిప్లిగంజ్‌.. పోలీస్ అధికారుల‌పై వేటు..

Published on: Sun Apr 3, 2022 1:26PM

ప‌బ్‌..డ్ర‌గ్స్‌. ఇది రొటీన్ న్యూస్‌. ప‌బ్‌పై టాస్క్‌ఫోర్స్ రైడ్స్.. డ్ర‌గ్స్ సీజ్‌. ఇది కూడా కామ‌నే. కానీ.. ఆ రైడ్స్‌లో కొణిదెల నిహారిక‌, రాహుల్ సిప్లిగంజ్ కూడా దొరికారు. ఇదే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్‌. నిహారిక‌తో పాటు ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేత అంజ‌న్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే నందీశ్వ‌ర్‌గౌడ్ కుమారులు కూడా ఉండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. గ‌ల్లా జ‌య‌దేవ్ కుమారుడు, న‌టి హేమ‌ కూడా ఉన్నారంటూ మీడియాలో వార్త‌లు వ‌చ్చినా.. తాము లేమంటూ వారు వివ‌ర‌ణ ఇచ్చారు. నాగ‌బాబు కూతురు నిహారిక‌, సింగ‌ర్-బిగ్‌బాస్ విన్న‌ర్‌ రాహుల్ సిప్లిగంజ్, ఏపీ మాజీ డీజీపీ కుమారుడితో స‌హా సుమారు 157 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి వ‌దిలేశారు. ప‌బ్ నిర్వాహ‌కులు ఐదుగురిని స‌మ‌గ్రంగా విచారిస్తున్నారు.

ఈ డ్ర‌గ్స్ క‌ల‌క‌లం అంతా.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో జ‌రిగింది. ఆదివారం వేకువజామున 2.30 గంటల సమయంలో నార్త్‌జోన్‌, సెంట్రల్‌ జోన్‌, వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మెరుపుదాడి చేశారు. సమయానికి మించి నడపడంతో పాటు రేవ్‌ పార్టీని నిర్వహిస్తుండటంతో పబ్‌ యజమానులు సహా సుమారు 157 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీరిలో 99 మంది యువకులు, 39 మంది యువతులు, 19 మంది పబ్‌ సిబ్బంది ఉన్నారు.  

ప‌బ్‌లో దాడి చేసిన సమయంలో కొకైన్‌, గంజాయి, కొన్ని రకాల డ్రగ్స్‌, ఎల్‌ఎస్‌డీతో ఉన్న సిగరెట్లను పోలీసులు గుర్తించారు. పోలీసుల‌ను చూడ‌గానే ప‌బ్‌లోని వాళ్లు త‌మ ద‌గ్గ‌ర ఉన్న డ్ర‌గ్స్‌ను కిటికీల నుంచి బ‌య‌ట‌కు పడేశారు. పూల‌కుండీల్లో విసిరేశారు. పోలీసులు ఆ డ్ర‌గ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ప‌బ్‌లో నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా డ్ర‌గ్స్ వినియోగంపై ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. పబ్‌ యజమానులపై కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ రేణుక చౌద‌రి కూతురు తేజ‌స్విని నుంచి రెండు నెల‌ల క్రిత‌మే ఆ ప‌బ్‌ను లీజ్‌కు తీసుకున్నారు అభిషేక్ ఉప్పాల అనే వ్య‌క్తి. ప‌బ్ మేనేజ‌ర్ కునాల్ కీ రోల్ ప్లే చేశార‌ని తెలుస్తోంది. నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ప‌బ్‌లో డ్ర‌గ్స్ పార్టీ జ‌రుగుతుంటే నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌నే కార‌ణంతో బంజారాహిల్స్ ఎస్సై, సీఐల‌ను స‌స్పెండ్ చేశారు. ఏసీపీకి ఛార్జ్ మెమో ఇచ్చారు. అయితే, ప‌బ్‌లో డ్ర‌గ్స్ దొరికినా.. అవి ఎవ‌రి ద‌గ్గ‌రా ల‌భించ‌లేద‌నే కార‌ణంతో ప్ర‌ముఖుల‌తో స‌హా దొరికిన వారంద‌రినీ వ‌దిలేయ‌డం.. అందులో నిహారిక‌తో పాటు మాజీ ఎమ్మెల్యేల కొడుకులు, మాజీ డీజీపీ కూతురు త‌దిత‌రులు ఉండ‌టం.. పోలీసుల‌పై తీవ్ర ఒత్తిడి వ‌స్తుండ‌టం.. కొంద‌రిని త‌ప్పించే ప్ర‌య‌త్నం జ‌రుగుతుండ‌టం.. విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. తెలంగాణ‌లో ప‌బ్స్‌ను నిషేధించి, మ‌ద్యపాన నిషేధం విధించాల‌నే డిమాండ్ కూడా వినిపిస్తోంది. డ్ర‌గ్స్‌పై పెద్ద ఎత్తున పోరాటానికి విప‌క్షం సిద్ధం అవుతోంది.