కోడెల ట్యాక్స్.. లక్షకు రూ.20,000 చొప్పున వసూలు!!
Published on: Fri Jun 14, 2019 1:07PM

వైసీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి, నటుడు పృథ్వీ ‘కోడెల ట్యాక్స్’ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను ఓసారి సత్తెనపల్లి వెళ్లినప్పుడు కోడెల కుటుంబం వసూలు చేస్తున్న ‘కె’ ట్యాక్స్ గురించి విన్నానని పృథ్వీ తెలిపారు. తాము జీఎస్టీ కడతామనీ, వాహనాలు కొనుగోలు చేస్తే రోడ్ ట్యాక్స్, ఇతర పన్నులు కడతామని చెప్పారు. కానీ సత్తెనపల్లిలో ‘వైఎస్సార్ కంటివెలుగు’ కార్యక్రమానికి హాజరైనప్పుడు తొలిసారి ఈ ‘కోడెల ట్యాక్స్’ గురించి విన్నానని అన్నారు. అక్కడ దిగగానే స్థానికులు కొందరు.. ‘‘సార్ ఇక్కడ బిల్డింగులు కట్టాలంటే లంచం ఇవ్వాలండి. ఓ కార్యక్రమం ప్రారంభించాలన్నా, కాంప్లెక్సులు కట్టాలన్నా కె ట్యాక్స్ కట్టాలండి. రూ.లక్షకు గానూ ఓ రూ.20,000 వీరికి చెల్లించుకోవాలి అని వాపోయారు. కోడెల పీఏ ప్రసాద్ ప్రజలను బెదిరించడం, వసూలు చేయడం ప్రారంభించాడు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


