TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అట్టుడికిన అమలాపురం.. కోనసీమ జిల్లా పేరు మార్పుపై భగ్గుమన్నజిల్లా

Published on: Wed May 25, 2022 7:03AM

కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. ప్రశాంతంగా ఉండే పట్టణం ఒక్కసారిగా రగిలిపోయింది. ఆందోళనలు హింసాత్మకం రూపం దాల్చాయి. మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటికి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ క్యాంపు ఆఫీసుకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.

ఐదు బస్సులను దగ్ధం చేశారు. పోలీసు వాహనాలపై రాళ్ల దాడి చేశారు. పలువురు పోలీసులు ఈ దాడిలో గాయపడ్డారు. ఎస్పీ తలకు గాయమైంది. ఈ ఆందోళనకు కారణం కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చడమే. మార్పును వ్యతిరేకిస్తూ ఆందోళనలు ప్రారంభం కావడంతో జిల్లా అంతటా 144వ సెక్షన్ విధించారు. అయితే ఆంక్షలను ఉల్లంఘించి వేలాది మంది అమలాపురంలో రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.  

పోలీసుల లాఠీ చార్జితో పరిస్థితి అదుపు తప్పింది.  ప్రభుత్వ వాహనాలు, భవనాలే లక్ష్యంగా ఆదోళనకారులు విధ్వంసానికి తెగబడ్డారు. అసలీ పరిస్థితికి కారణం ప్రభుత్వమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జగన్ ప్రభుత్వం ఏకపక్షంగా పేరు మార్చడంతోనే సమస్య ఉత్పన్నమైందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. తొలుతే బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టి ఉంటే ఎలాంటి సమస్యా ఉండేది కాదని అంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో జిల్లాకు బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టాలన్న అభ్యర్థనలు వచ్చినా పట్టించుకోని సర్కార్ జిల్లాకు కోనసీమ అని పేరు ఖరారు చేసింది.

అప్పట్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు కూడా కోనసీమ జిల్లా పేరు మార్పు ప్రసక్తే లేదనీ, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత ఇక పునరాలోచన ఉండదనీ స్పష్టం చేశారు. కానీ ఇన్ని రోజులు గడిచిన తరువాత మరే జిల్లా విషయంలోనూ లేని విధంగా కోనసీమ జిల్లా పేరు మార్పునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయడంతోనే సమస్య ఉత్పన్నమైందంటున్నారు. కోనసీమ సాధన సమితి నాయకులు కూడా ఇదే చెబుతున్నారు. తాము అంబేడ్కర్ కు కానీ జిల్లాకు ఆయన పేరు పెట్టడానికి కానీ తాము వ్యతిరేకంకాదనీ అయితే.. ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం పేరు మార్పు విన్యాసాలు చేయడాన్నే వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నారు. అంబేడ్కర్ అంటే తమకు అపారమైన గౌరవమనీ, ఇలా ఓట్ల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఆయన పేరును వాడుకుని అవమానించడాన్నే తాము తప్పుపడుతున్నామని చెబుతున్నారు. 

ప్రశాంతతకు మారుపేరైన కోససీమ  ఇప్పడు ఆందోళనల సెగతో వేడెక్కడానికి జగన్ సర్కార్ తప్పిదమే కారణమనీ, కొత్త జిల్లాల ఏర్పాటు, వాటికి పేర్ల విషయంలో ఎలాంటి కసరత్తూ లేకుండా తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు కోనసీమలో అనవసర చిచ్చుకు, రచ్చకు కారణమైందనీ తెలుగువన్ గతంలోనే చెప్పింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటించిన సమయంలోనే పలు దళిత సంఘాలు కోనసీమకు డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరాయి. అప్పడు వాటి వినతిని పెడచెవిన పెట్టి కోనసీమ జిల్లాగా నామకరణం చేసి ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం జిల్లా పేరు మార్పునకు నిర్ణయించడం వల్లనే కోనసీమలో ఆందోళనలు ఉవ్వెత్తున రేగాయని తెలుగువన్ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించినప్పుడే పేర్కొంది. ప్రజల ఇష్టాయిష్టాలూ, భావోద్వేగాలతో సంబంధం లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం వెంపర్లాడటం వల్లనే ఎప్పడూ ప్రశాతంగా ఉండే కోనసీమ నేడు రగిలిపోతున్నది. కాగా   అధికార పార్టీ రాజకీయ వ్యూహంలో భాగంగానే కోనసీమలో ప్రస్తుత పరిస్థితి అన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలన్న జగన్ సర్కార్ దుష్టపన్నాగమేనని పరిశీలకులు పేర్కొంటున్నారు.