కింద పడ్డా మాదే పై చేయి.. సజ్జల వితండ వాదన!
Published on: Fri May 13, 2022 10:26AM
గడప గడపకూ ప్రభుత్వం పేరుతో జగన్ సర్కార్ చేపట్టిన కార్యక్రమంలో గడప గడపకూ ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తమౌతుంటే.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం అందుకు ససేమిరా అంగీకరించడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న వారెవరికీ ఆ అర్హత లేదంటున్నారు. గడప గడపకూ కార్యక్రమంలో నిరసనలు ఎదురౌతున్నాయని అంగీకరిస్తూనే కింద పడినా పై చేయి మాత్రం మాదేనంటూ వితండ వాదనను తెరపైకి తీసుకువస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు మీడియాలో విస్తృత ప్రచారం రావడం, సామాజిక మాధ్యమంలో ప్రభుత్వంపై ట్రోలింగ్ పెరగడంతో ఆయన ఒకింత అసహనానికి గురయ్యారని పిస్తోంది. జగన్ సర్కార్ లో ప్రభుత్వ సలహాదారు హోదాలో సూపర్ మంత్రిగా అన్ని శాఖల ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న సజ్జల గడప గడపకూ కార్యక్రమంపై ప్రభుత్వ రియాక్షన్ చెప్పేందుదుకు మీడియా ముందుకు వచ్చారు. ప్రజా నిరసనలను తగ్గించి చూపే ప్రయత్నం చేశారు. నిరసనలు ఎదురౌతున్న మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే ఆ నిరసనలు చేసే వారెవరికీ ఆ అర్హత లేదని, అలా నిరసనలు చేస్తున్న వారంతా ప్రభుత్వ పథకాలకు అర్హత లేనివారేనని తీర్మానించేశారు.
అర్హత లేకుండా తమకు కూడా ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని కోరుతూ వారు నిరసనలకు దిగుతున్నారని కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారు. పథకాలకు నిబంధనల సంకెళ్లు వేసి ఎవరికీ అందకుండా విధానాలు రూపొందించిన ఘనత వహించిన ప్రభుత్వం.. పథకాల గురించి తప్ప అభివృద్ధి గురించి, సమస్యల గురించి మాత్రం గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో ప్రస్తావించడం లేదు. లబ్ధిదారుల జాబితాలతో లబ్ధిదారుల గడప కు వెళ్లి ఘనంగా ప్రచారం చేసుకుందామనుకున్న ప్రభుత్వానికి తొలి రోజునే నిరసనల సెగ తగలడంతో ఉక్కిరి బిక్కిరైంది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం కేబినెట్ సమావేశం తరువాత మంత్రులతో మళ్లీ ప్రత్యేకంగా సమావేశమై ( ఈ సమావేశానికి అధికారులెవరినీ అనుమతించలేదు) గడప గడపకూ కార్యక్రమంపై మరోసారి దిశా నిర్దేశం చేశారు.
అయితే ప్రజా నిరసనల ఉధృతిని స్వయంగా అనుభవించిన నేతలు.. కార్యక్రమాన్ని కొన్ని రోజులు వాయిదా వేసి.. ఏవో కొన్ని ప్రజోపయోగకరమైన పనులను ప్రారంభించి తరువాత కొనసాగిద్దామని ప్రతిపాదించినా సీఎం ససే మిరా అన్నారట. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి గడప గడపకూ కార్యక్రమం బ్రహ్మాండంగా సాగుతోందని నమ్మించడానికి ప్రయత్నిస్తూ.. నిరసనలు వాస్తవమే కానీ, అనర్హుల నిరసనలవి అని భాష్యం చెబుతున్నారు.
గడప గడపకూ కార్యక్రమం వల్ల పార్టీకి కానీ, ప్రభుత్వానికి కానీ ఒనగూరే ప్రయోజనం ఇసుమంతైనా లేదని వైసీపీ క్యాడర్ చెబుతున్నారు. సంక్షేమ పథకాలలో లబ్ధిరాదుల సంఖ్యను కుదిస్తూ పోవడం వల్లనే ప్రజాగ్రహం పెల్లుబుకుతోందనీ, విద్యుత్ చార్జీల బిల్లులు కూడా గతం కంటే 70 నుంచి 75 శాతం అధికంగా రావడం వల్ల కూడా జనాగ్రహం తీవ్రంగా వ్యక్తమౌతోందని వారు చెబుతున్నారు.


