TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొత్త జిల్లాలు వస్తే.. కొత్త వెలుగులొస్తాయా?

Published on: Fri Jan 28, 2022 11:12AM

ఇప్పుడు ఏపీలో ఏ ఇద్దరు రాజకీయ నాయకులు కలిసిన ఒకటే, చర్చ. జిల్లాల పునర్విభజన. కాదంటే ఉద్యోగుల సమ్మె. నిజానికి, ఈ రెండు వేర్వేరు విషయాలు కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వేస్తున్న తప్పుడు అడుగులకు పుణ్యమే, ఈ రెండు సమస్యలు. పీఆర్సీ మంటలను చల్లార్చేందుకు, వ్యూహాత్మకంగా జగన్ రెడ్డి ప్రభుత్వం జిల్లాల విభజన అంశాన్ని తెరమీదకు తెచ్చింది. అయితే, ‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడొచ్చింది’ అన్నట్లు, ఉద్యోగుల పీఆర్సీ సమస్యకు వేసిన జిల్లాల విభజన మందు వికటించింది. పీఆర్సీ సమస్య చల్లారలేదు. కానీ కొత్త జిల్లాల సమస్య నెత్తినెక్కి కూర్చుంది. సర్కార్ చిక్కులో చిక్కుంకుంది. ఒక విధంగ జనంలో నవ్వుల పాలవుతోంది.    
 

అదలా ఉంచి, విషయంలోకి వస్తే, జిల్లాల సంఖ్యను పెంచడం వలన చేత, ఏమిటి ప్రయోజనం, ఎవరికి ప్రయోజనం? అని ఆలోచిస్తే, సామన్య ప్రజలకు పెద్దగా ప్రయోజనం ఉండక పోవచ్చును కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, కొంచెం చాలా ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. అలాగే రాజకీయ బేహారులకు కూడా కొంచెం ఎక్కువ ప్రయోజనం ఉండవచ్చును. పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రం తెలంగాణ విషయమే తీసుకుంటే, ఏపీలో ఉన్న 13 జిల్లాలను 26 చేస్తే, తెలంగాణలో పాత 10 జిల్లాను,ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసేఆర్, ‘బంగారు’ తెలంగాణ స్కీములో  భాగంగా  ఏకంగా 33 జిల్లాలను చేశారు.
 

ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్, ‘ముందు’  చూపుతో పది జిల్లాలను 33 జిల్లాలు చేశారు  కాబట్టే, 33 మందికి జిల్లా అధ్యక్ష పదవులు దక్కాయి. అలాగే, రాజకీయ బేహారులకు, అటు రాజకీయ పదవులు , అటు నామినేటెడ్ పదవులు మరిన్ని దక్కుతాయి. భవన నిర్మాణాలు చేపట్టడం వలన, మేఘా వంటి మేడి పండు కంపెనీలకు ఏమైనా మేలు జరిగిదేమో కానీ, జనాలకు అయితే ఇంతవరకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని అంటున్నారు. మహా అయితే, ప్రయాణ ఖర్చులు పది రూపాయలు ఏమైనా మిగిలితే మిగిలాయి ఏమో కానీ, అంతకు మించి ప్రయోజనం ఏమీలేదని సామాన్యులు అంటున్నారు.
 

తెలంగాణలో జిల్లాల విభజన తర్వాత కొత్త కలెక్టరేట్’లు, కొత్త ఎస్పీ ఆఫీసులు సహా ఇతర కార్యాలయాలన్నీ ఆయా కేంద్రాల్లో ఏర్పాటయ్యాయి. ఆ స్థాయిలో కొత్త ఉద్యోగాల కల్పన జరగలేదు. జిల్లాలతో పాటుగా నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతోంది. నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.కానీ, తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలను పరిగణనలోకి తీసుకుని చేపట్టిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలు, పెను దుమరాన్నే సృష్టించాయి. కుటుంబాలు చిన్నభిన్నమయ్యాయి. ఆత్మహత్యలకు కారణమయ్యాయి. ఇలా ఎలా చూసినా, తెలంగాణలో జిల్లాలు పెరిగినా అభివృద్ధి జరగలేదు. ఆత్మహత్యలు ఆగలేదు.


ఇక ఏపీలో పాలనా సౌలభ్యం కోసం జిల్లాలు విభజిస్తున్నామని సర్కార్ సారులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే చెపుతోంది. కానీ, జరిగేది మాత్రం వేరుగానే ఉంటుందని వేరే చెప్పనక్కర లేదు. తెలంగాణలో ఏమి జరుగిందో, ఏపీలోనూ అదే జరుగుతుంది. ఇప్పటికే ఒక అనాలోచిత నిర్ణయంతో గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థతో జీతాల భారం పెరిగి, చివరకు జీతాలు ఇవ్వలేని స్థితికి పరిస్థితి దిగజారింది.  ఇలాంటి పరిస్థితుల్లో పాలనా సౌలభ్యం కోసం అంటూ కొత్త భారాన్ని నెత్తికి ఎత్తుకోవడం అవసరమా? పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు తెలంగాణను చూసి ఏపీ వాతలు పెట్టుకోవడం అవసరమా? అసలు, ఈరోజు కార్యాలయాలకు వెళ్లి పనులు చేసుకోవలసిన అవసరమే తగ్గిపోతున్నప్పుడు, పరిపాలనా సౌలభ్యం కోసం భారం పెంచుకోవడం, వివేకం అనిపించుకుంటుందా?ఆ పెట్టే ఖర్చేదో, సాంకేతిక సదుపాయలను మెరుగు పరచుకునేందుకు ఉపయోగించుకుంటే, పరిపాలనా సౌలభ్యం ఏర్పడుతుంది, అవినీతి కూడా అంతో ఇంతో తక్కుతుందని, ప్రభుత్వం ఆ కోణంలో ఆలోచిస్తే ఉభయతారకంగా ఉంటుందని అంటున్నారు.