TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టెర్రరిస్టులను జనమే పట్టుకున్నారు.. రివార్డులు అందుకున్నారు!

Published on: Mon Jul 4, 2022 6:35AM

జమ్మూ కాశ్మీర్ లో  పరిస్థితులు మారుతున్నాయి. గతంలో టెర్రరిస్టులకు గ్రామాల్లో ఆశ్రయం కల్పించే వారు అక్కడి ప్రజలు. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు మారుతున్నాయనడానికి తాజా ఉదాహరణ గ్రామస్తులే టెర్రరిస్టులను పట్టించిన సంఘటన. ఇప్పటి వరకూ కేంద్రం, భద్రతా బలగాలూ కూడా గ్రామాల్లో టెర్రరిస్టులకు షెల్టర్ లభిస్తోందనీ, అక్కడ నుంచి వారు సైన్యం, పోలీసులు, ప్రజలు లక్ష్యంగా దాడులకు పాల్పడి.. గ్రామ స్థుల రక్షణతో సులభంగా తప్పించుకు పారిపోతున్నారనీ చెబుతూ వస్తున్నారు.

ఇప్పుడా పరిస్థితి మారుతోంది. గ్రామాలలో టెర్రరిస్టులకు షెల్టర్ దొరకడం లేదు.  తాజాగా ఆదివారం   రియాసి జిల్లా తుక్సాన్ గ్రామ ప్రజలు ఆయుధాలతో ఉన్న ఇద్దరు ఎల్ఈటీ ఉగ్రవాదులను పట్టుకున్నారు. వీరి దగ్గర నుంచి  రెండు ఏకే రైఫిళ్లు, 7 గ్రానెడ్లు, ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఉగ్రవాదులను ఫైజల్ అహ్మద్ దార్, తాలిబ్ హుస్సేన్‌లుగా గుర్తించారు. ఇటీవల కాలంలో చినాబ్ లోయ, రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో తీవ్రవాద కార్యకలాపాలను మళ్లీ ప్రారంభించడానికి ఎల్ఈటీ తీవ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు గమనించామని.. ఇందులో భాగంగానే కొంతమందిని తీవ్రవాదులుగా చేర్చుకుని రెండు టెర్రర్ మాడ్యుళ్లను ఏర్పాటు చేసుకున్నారని  పోలీసులు వెల్లడించారు.

ఇందులో మొదటి మాడ్యుల్ నెల క్రితం ఉదంపూర్ లో జరిగిన బాంబు పేలుడుతో, రెండవది పదిరోజుల క్రితం రాజౌరిలో జరిగిన పేలుడుతో సంబంధాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. అప్పటి నుంచి ప్రధాన ఉగ్రవాది తాలిబ్ హుస్సెన్ పరారీలో ఉన్నారని.. తాజాగా ఈ రోజు గ్రామస్తుల సాయంతో పట్టుకున్నట్లు వెల్లడించారు.

ఉగ్రవాదులను పట్టుకున్న గ్రామస్తులకు ప్రశంసలు దక్కుతున్నాయి. గ్రామస్తుల ధైర్యాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తుక్సాన్ గ్రామ ప్రజలకు రూ. 5 లక్షల రివార్డ్ ప్రకటించారు. ఇదే విధంగా జమ్మూ కాశ్మీర్ పోలీసుల తరుపున డీజీపీ మరో రెండు లక్షలు  రివార్డు ప్రకటించారు.