TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాహుల్ గాంధీకి శిక్ష విధించిన జడ్జీకి ప్రమోషన్.. ఇది నజరానాయేనా?

Published on: Fri May 5, 2023 7:43PM

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఇటీవల సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. న్యాయమూర్తి హరీశ్ హసుఖాభాయి వర్మ ఈ కేసును విచారించి.. రాహులుకు రెండేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆయనతో పాటు మరో 68 న్యాయమూర్తులకు జిల్లా జడ్జి కేడర్ కు పదోన్నతి దక్కింది. అయితే, వారి ప్రమోషన్ ను  సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. సీనియర్ సివిల్ జడ్జి కేడర్ కు చెందిన ఇద్దరు అధికారులు ఈ పదోన్నతులను సవాల్ చేశారు.

'మెరిట్- కమ్- సీనియారిటీ' ఆధారంగా కాకుండా.. 'సీనియారిటీ- కమ్- మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గుజరాత్ హైకోర్టు జారీ చేసిన సెలక్షన్ జాబితాను, వారిని నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని పిటిషన్ లో కోరారు. అంతేకాకుండా, జ్యుడిషియల్ అధికారుల నియామకానికి సంబంధించి మెరిట్- కమ్- సీనియారిటీ ఆధారంగా కొత్త జాబితాను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పై మే 8న విచారణ చేపట్టనుంది.

సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను తన సొంతానికి వాడుకుంటూ.. తమలపై దాడులకు కేంద్రంగా పాల్పడుతుందంటూ కొంతకాలంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించిన న్యాయమూర్తికి పదోన్నతి కల్పించడంతో.. కేంద్రం అటు న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తూ.. తన కనుసన్నలతో పైరవీలు నడుపుతోందా అని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.