బలిసి కొట్టుకుంటున్నది మీరే.. వైసీపీ ఎమ్మెల్యేకి సినీ నిర్మాత స్ట్రాంగ్ కౌంటర్..
Published on: Wed Jan 12, 2022 2:57PM
సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు.. సినిమా వాళ్లకి ఏపీతో ఏం సంబంధం.. అంటూ నోటికొచ్చినట్టు వాగారు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేశాయి. మరీ, అంత దారుణంగా బలిసి కొట్టుకుంటున్నారని అనడమేంటని మండిపడుతున్నారు పరిశ్రమ వర్గాలు. ఏపీలో ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా.. ముందుండి సాయం చేసేది సినిమా వాళ్లేగా అని గుర్తు చేస్తున్నారు.
లేటెస్ట్‌గా ఎమ్మెల్యే నల్లపురెడ్డి వ్యాఖ్యలకు తెలుగు ఫిలిమ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, నిర్మాత ఎన్వీ ప్రసాద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘మీడియా ముందు మాట్లాడితే హీరో అవుతారని అనుకుంటున్నారు.. బలిసి కొట్టుకుంటోంది మీరే’’ అంటూ మండిపడ్డారు. నల్లపురెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సినిమావాళ్లు బలిసి కొట్టుకుంటున్నారని మాట్లాడారని, అది ఆయనకే వర్తిస్తుందని అన్నారు. ఇక్కడ ఎవరూ బలిసి కొట్టుకోవడంలేదన్నారు. సినిమాలో నటించాలంటే వంద అడుగుల రోప్ కట్టుకుని, రోప్‌పైకి ఎక్కి.. వంద అడుగులు దూకితే.. ఎవరు బలసి కొట్టుకుంటున్నారో తెలుస్తుందంటూ ఘాటుగా విమర్శించారు. సినిమా నిర్మాణం ఎంత కష్టమో తెలియాలంటే తన సినిమా షూటింగ్ దగ్గరకు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి వచ్చి చూడాలని సవాల్ చేశారు.
తాము కూడా నల్లపురెడ్డిపై నోటికొచ్చినట్టు మాట్లాడగలమని.. అయితే, తమకు సంస్కారం ఉందని, మీడియా ముందు మాట్లాడితే హీరోలు అయిపోరన్నారు. నల్లపురెడ్డి రాజకీయ జీవితం ఏంటో కొవూరులో అందరికీ తెలిసిందేనని నిర్మాత ఎన్వీ ప్రసాద్ అన్నారు.


