ప్రొద్దుటూరు కాంగ్రెస్ లో పదవుల చిచ్చు
Published on: Mon Feb 27, 2012 2:54PM
ప్రొద్
దుటూరు: మున్సిపల్ ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికలు త్వరలో జరగుతున్నయనే సూచనలు వస్తున్న తరుణంలో కడపజిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు పెరుగుతుండటం ఆ పార్టీని కలవరపెడుతుంది.తాజాగా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ చార్జి మధ్య పదవుల చిచ్చు రగిలింది. ప్రొద్దుటూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బషీర్ అహ్మద్ పేరును ప్రతిపాదించానని, ఆయనే అధ్యక్షుడిగా ఉంటారని మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి ప్రకటించారు. దీనికి నియోజకవర్గ ఇన్ చార్జి ముక్తియార్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమతో ఏమాత్రం సంప్రదించకుండానే బషీర్ అహ్మద్ పేరును ఏకపక్షంగా ప్రకటించారంటూ ఆయన వరదరాజులురెడ్డిపై పిసిసి, డిసిసికి ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువురి మధ్య ఉన్న విభేదాలు బైటపడ్డాయి.
వరదరాజులురెడ్డి జగన్ వర్గంలోకి వెళ్ళిన సందర్భంలో ఆయన అనుచరుడైన ముక్తియార్ కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. అతనికి నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతలు ఇస్తామని అమాత్యులు, పిసిసి హామీ ఇవ్వడంతో ముక్తియార్ కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. ఇది వరదరాజులు రెడ్డికి ఆగ్రహాన్ని తెప్పించింది. వరదరాజులురెడ్డి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చినప్పటినుంచి ముక్తియార్ కు చెక్ పెడుతూ వచ్చారు. దీనిలో భాగంగానే మైనార్టీ వర్గానికి చెందిన మరో నాయకుడు బషీర్ అహ్మద్ ను ప్రొద్దుటూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ప్రకటించారు. ఈ ప్రకటన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో చిచ్చును రగిల్చింది.


