పాలసీదారులను ఇబ్బందులు పెడుతున్న ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు
Published on: Thu May 3, 2012 10:34AM
పాలసీదారులను ఇబ్బందులు పెడుతున్న ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు రాష్ట్రంలోని ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు పాలసీ దారులను ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ ఇన్స్యూరెన్స్ కంపెనీలు పాలసీలు కట్టి అపారంగా నష్టపోయామని పలువురు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇన్స్యూరెన్స్ రంగంలో ఎల్,ఐ.సి.తో పాటు పీర్ లెస్ అనే ప్రైవేట్ సంస్థమాత్రమే ఉండేది. కానీ, కేంద్రప్రభుత్వ సరళీకృత విధానాలవల్ల దేశవ్యాప్తంగా సుమారు 24 ఇన్స్యూరెన్స్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. వీటిలో ఎక్కువశాతం బ్యాంకులు, ఆర్ధికసంస్థలు ఏర్పాటు చేసినవే కావటం విశేషం.
వీటిమధ్య ఏర్పడిన అనారోగ్య పోటీకి పాలసీదారులు బలవుతున్నారు. ఏదో రకంగా వ్యాపారం చేసి తార్గెట్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ కంపెనీల మేనేజర్లు, ఏజెంట్లు పాలసీదారులకు లేనిపోని వాగ్దానాలు చేస్తున్నారు. తీరా పాలసీ మెచ్యూరిటీ సమయానికి ఆయా కంపెనీలు వాగ్దానం చేస్తున్నంత మొత్తం రాకపోవటంతో పాలసీదారులు నిరాశకు గురవు తున్నారు. దీనికి తోడు పలు సందర్భాల్లో ఏజెంట్లు పాలసీదారులను దారుణంగా మోసగిస్తున్నారు. కమీషన్లకు కక్కుర్తిపడుతున్న ఏజెంట్లు సింగిల్ ప్రీమియం పాలసీకి అత్యధికంగా 4 నుంచి 6 శాతం వరకూ కంపెనీలు ఛార్జి చేస్తాయి. దీనిలో ఏజెంటుకు 2 శాతం లోపే కమీషను వస్తుంది.
ఈ పాలసీల వల్ల ఏజెంట్లకు పెద్దగా ఉపయోగం ఉండదు. అందువల్ల ఈ పాలసీలను రెగ్యులర్ ప్రీమియం పాలసీలుగా మారిస్తే కనీసం 20 నుండి 30 శాతం కమీషను పొందవచ్చు. ఏజెంట్లు ఇలా సింగిల్ ప్రీమియం పాలసీలను రెగ్యులర్ ప్రీమియం పాలసీలుగా మార్చటం వల్ల ఆదాయం పెరుగుతుందని కక్కుర్తి పడుతున్నారు. ఫలితంగా పాలసీదారుల ఇన్వెస్ట్ మెంట్ తగ్గి చివరకు వారికి వచ్చే రాబడులు కూడా తగ్గిపోతాయి.
వాస్తవానికి ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు కేవలం భీమాపాలసీలనే కాకుండా షేర్ మార్కెట్ తో ముడిపడిన పాలసీలను ఎక్కువగా విక్రయిస్తున్నాయి. ఇటువంటి పాలసీలను ఎక్కువగా విక్రయించటం వల్ల ఆయా కంపెనీలకు పలు ఛార్జీల రూపంలో పెద్దమొత్తంలో ఆదాయం వస్తుంది. ఇన్వెస్ట్ మెంట్ ప్యాట్రన్ తెలియని పాలసీదారులు మాత్రం అపారంగా నష్టపోతున్నారు. ఇటువంటి మార్కెట్ లింక్ డ్ పాలసీలు కట్టి అసలు మొత్తాన్ని కూడా నస్తపోయిన కష్టమార్లు అనేకమంది ఉన్నారు. దీనికి కూడా ప్రధానమైన కారణం పరిశీలిస్తే ఏజెంట్ కు ఫండు ఆప్షన్స్ గా పూర్తిగా అవగాహన లేకపోవటమేనని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి.
ఒక ఫండ్ లో నష్టం వస్తుంటే మరోదానికి ఆప్షన్ మార్చేందుకు ఏజెంట్ కృషి చేయకపోవటం వల్ల పాలసీదారుడు నష్టపోతున్నాడు. పాలసీదారునికి ఏ ఫండ్ లో కడితే సెక్యూరిటీ ఉంటుందో ఏజెంటు సవివరంగా చెప్పడు. ఆ ఏజెంటుపై ఉండే సేల్స్ మేనేజర్లే చెప్పాలి. ఉద్యోగఒత్తిడుల వల్ల సేల్స్ మేనేజరు కొత్త నియామకాలకు ఇచ్చే ప్రాధాన్యత ఏజెంటుకు అవగాహన పెంచేందుకు ఇవ్వటం లేదు. దీంతో మూడేళ్ళ క్రితం ఐదులక్షల రూపాయలు కట్టిం పాలసీదార్లు తమ పాలసీని రద్దు చేసుకుంటే వారికి రెండు నుంచి మూడు లక్షల రూపాయలు మించి రావటం లేదు. ఇటువంటి సంఘటనలతో ప్రైవేట్ కంపెనీల్లో ఇన్స్యూరెన్స్ కట్టడానికి సాధారణ ప్రజలు భయపడుతున్నారు.


