వారణాసి వెళ్ళడానికి ప్రియాంక ఎందుకు భయపడింది?

 

 

 

దేశంలో నరేంద్రమోడీ హవా వీస్తోంది. ఆ విషయం కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అర్థమైనా అర్థంకానట్టు నటిస్తోంది. తమనుంచి అధికార పీఠాన్ని మోడీ గద్దలాగా తన్నుకుని పోవడం ఖాయమని అర్థమైపోయిన సోనియా, రాహుల్ గాంధీ ద్వయం మోడీ మీద చాలా కోపంగా మాట్లాడుతున్నారు. ఆ తానులో గుడ్డే అయిన ప్రియాంక కూడా తన కుటుంబం ఓటమికి గురికాబోతోందన్న విషయాన్ని తట్టుకోలేకపోతోంది. అందుకే అందుకు కారణం కాబోతున్న మోడీ మీద తూటాల్లాంటి మాటలు వదులుతోంది. ఇంతకాలం నాయనమ్మని గుర్తు చేసే ఆమె పర్సనాలిటీని మాత్రమే చూసిన భారత ప్రజలు ఈ ఎన్నికల పుణ్యమా ఆమె ఎంత ఘాటుగా మాట్లాడగలదో కూడా చూస్తున్నారు. ఇంతఘాటుగా మాట్లాడే శక్తి వుంది కాబట్టే మోడీ పోటీ చేస్తున్న వారణాసి నియోజవకర్గంలో ప్రియాంకని ప్రచారానికి దించాలని కాంగ్రెస్ వర్గాలు భావించాయి. ఈ ప్రతిపాదనకు ప్రియాంక మొదట్లో సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ, తాజాగా తాను మోడీ పోట చేస్తున్న వారణాసిలో ప్రచారం చేయబోనని ప్రకటించారు. తాను అమేథి, రాయబరేలి నియోజకవర్గాలలో మాత్రమే ప్రచారం చేస్తానని గతంలో చెప్పిన మాటని గుర్తుచేస్తోంది. అయితే రాజకీయ పరిశీకులు మాత్రం, ఎలాగూ కచ్చితంగా ఓడిపోయే స్థానానికి వెళ్ళి ప్రచారం చేయడం దండగని ప్రియాంక భావించిందని అంటున్నారు. ప్రియాంక ప్రచారం చేశాక కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతే అది ప్రియాంకకే మైనస్ కాబట్టి వారణాసిలో ప్రచారం చేయకుండా ప్రియాంక వెనకడుగు వేసినట్టు భావిస్తున్నారు.