సోనియా స్థానంలో ప్రియాంక..

 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూతురు ప్రియాంక గాంధీ పేరు ఇప్పుడు కాంగ్రెస్ లో బాగానే వినిపిస్తుంది. గత కొద్ది రోజులుగా సోనియాగాంధీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ప్రియాంకానే రాజకీయ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అంతేకాదు సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పొత్తు విషయంలో కూడా ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీ రాయ్ బరేలి నియోజకవర్గం నుంచి 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ నియోజక వర్గం నుండి సోనియా గాంధీ ఎంపీ గా ఉన్నారు. అయితే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఆమె తప్పుకుంటారన్న వార్తలు వినిపిస్తున్న తరుణంలో.. ఆ స్థానం నుండి ప్రియాంక పోటీకి దిగుతారన్న వార్తలు వస్తున్నాయి. అంతేకాదు మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ప్రియాంక రాజకీయాల్లో మరింత పెద్ద పాత్ర పోషించాలని కోరుకుంటున్నారు.  ఇక 'రాహుల్‌ తన సోదరిపైన ఆధారపడటం ఇటీవల బాగా పెరిగింది. సోనియాగాంధీ నిర్వహిస్తున్న అనేక బాధ్యతలను చూసుకోవడమే కాదు.. రాహుల్‌ కార్యాలయం తెరవెనుక బాధ్యతలను కూడా ఆమెనే చక్కబెడుతున్నారు' అని పార్టీ నేతల టాక్. దీంతో ప్రియాంక ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.