కాంగ్రెస్ కి షాకిచ్చిన ప్రియాంక.. రాహుల్ కి లేఖ

 

సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది పార్టీకి గుడ్‌బై చెప్పారు. కొద్దిరోజుల క్రితం మధురలో మీడియా సమావేశంలో కొందరు కాంగ్రెస్ నేతలు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆమె పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం.. అనంతరం వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిపోయాయి. అయితే, తాజాగా జ్యోతిరాదిత్య సింథియా.. వారిపై సస్పెన్సన్ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించడంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక చతుర్వేది సొంత పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం శ్రమించేవారికి బదులు కాంగ్రెస్‌లో గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ విమర్శించారు. దీంతో ఆమె కాంగ్రెస్ ని వీడుతారంటూ వార్తలొచ్చాయి. ఊహించినట్లు గానే ఆమె ఈరోజు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీలోని‌ అన్ని పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె ఐఏసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రెండు పేజీల రాజీనామా లేఖను రాశారు.

కాగా, కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన ప్రియాంక చతుర్వేది.. ముంబైలో శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ సమక్షంలో ప్రియాంక చతుర్వేది శివసేన పార్టీలో చేరారు.