ముఖ్య నేతలతో ప్రియాంక గాంధీ సమావేశం

 

 

 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ వాద్రా పార్టీ ముఖ్య నేతలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జనవరి 17న జరిగే ఏఐసిసి సమావేశంలో రాహుల్ గాంధీని తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకొంది. సమావేశంలో కూడా ఈ అంశంపైనే చర్చించినట్లు సమాచారం. భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. పార్టీలో అంతర్గత మార్పులపై కూడా చర్చించినట్లు సమాచారం. కాగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయరని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే ఆమె పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు వారంటున్నారు.