కాంగ్రెస్ అధినేత్రిగా ప్రియాంక?
Published on: Sun Aug 21, 2022 10:26AM
కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. త్వరలోనే నామినేషన్ల ప్రక్రియకు ఆ పార్టీ శ్రీకారం చుట్టనుంది. ఇదంతా ప్రతి పార్టీలోనూ మామూలుగా జరిగే వ్యవహారమే. కానీ కాంగ్రెస్ పార్టీ విషయం మాత్రం ప్రత్యేకం. పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ ససేమిరా అంటుండటం, ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు మోస్తున్న సోనియా గాంధీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటం.. గాంధీ కుటుంబం వినా మరో వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ సిద్ధంగా లేకపోవడంతో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఎన్నిక గడువు సమీపిస్తున్న సమయంలో కూడా పార్టీ చీఫ్ విషయంలో ఎటువంటి పురోగతీ కనిపించడం లేదు.
2019 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం తరువాత నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ పార్టీ నుంచి ఎంతగా ఒత్తిడి వచ్చినా రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడలేదు. అనివార్య పరిస్థితిలో సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇక ఆ బాధ్యతలు తాను చేపట్టలేనని సోనియా కూడా తేల్చేశారు. దీంతో పార్ట అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపడతారన్న విషయంలో పార్టీలో సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ప్రియాంకు ఒప్పించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉందని పరిశీలకులు అంటున్నారు. ఎందు కంటే గాంధీ కుటుంబం నుంచి కాకుండా బయట నుంచి ఎవరైనా పార్టీ పగ్గాలు చేపడితే.. పార్టీని ఐక్యంగా ఉంచడం సాధ్యం కాదని పార్టీలో మెజారిటీ నాయకులు భావిస్తున్నారు.
అందుకే పార్టీ మొత్తం ఇప్పుడు ప్రియాంక వైపు చూస్తున్నది. ఆమెలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పోలికలు ఉన్నాయని చెబుతుంటారు. ప్రియాంక గాంధీ కూడా ఇటీవలి కాలంలో పార్టీ వ్యవహారాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రత్యక్ష ఆందోళనల్లో సైతం పాలు పంచుకుంటున్నారు. దీంతో ఆమెకు అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తే పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని పార్టీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. అయితే ఇటీవలి యూపీ ఎన్నికలలో వైఫల్యం ఆమెకు ప్రతిబంధకంగా మారుతుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇక కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి ఆగస్టు 21(ఆదివరం) నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆగస్టు 28 నామినేషన్ల దాఖలుకు తుది గడువు.
ఆగస్టు 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఆగస్టు 28. అంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనా ఇప్పటికీ అధ్యక్ష పదవికి నామినేషన్ల వ్యవహారంలో పార్టీ ఇంకా ఏ నిర్ణయానికీ రాలేదు. ఇంకా అధ్యక్ష పగ్గాలు చేపట్టాల్సిందిగా పార్టీ సీనియర్లు రాహుల్ గాంధీని ఒప్పించేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఆయన అందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. అలాగే ఆయన పార్టీ తీసుకునే కీలక నిర్ణయాల విషయంలో కూడా అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారు.
బీహార్‌లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి ఏర్పాటులో కూడా ఆయన జోక్యం ఇసుమంతైనా లేదు. ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్లు ప్రియాంక వైపు చూస్తున్నారు.పార్టీలో నాయకత్వ సంక్షోభానికి తెరపడాలంటే పార్టీ పగ్గాలు అందుకోవడానికి రాహుల్ గాంధీ అయినా అంగీకరించాలి.. లేదా ప్రియాంక గాంధీ అయినా ముందుకు రావాలని పార్టీ సీనియర్లు అంటున్నారు. ఒక వేళ అనివార్యంగా గాంధీ కుటుంబానికి చెందని వారెవరైనా పార్టీ పగ్గాలు చేపట్టాల్సి వస్తే ఆ వ్యక్తి ఎవరన్న దానిపై ఏకాభిప్రాయం కుదిరే అవకాశాలు ఏ మాత్రం లేవు.


