కొవిడ్ చికిత్స ధరలు ఖరారు.. కేసులు తగ్గాక అమలు..!
Published on: Wed Jun 23, 2021 12:37PM
కరోనా సోకిందనే భయం కన్నా.. ఎక్కడ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుందోననే భయమో జనాలను బాగా వేధిస్తోంది. పరిస్థితి అంత దారుణంగా ఉంది మరి. కొవిడ్ ట్రీట్‌మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరితే ఇక అంతే సంగతి. కరోనా తగ్గడం తర్వాతి విషయం ముందుగా ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి. వైరస్ శరీరాన్ని పీల్చిపిప్పి చేస్తే.. హాస్పిటల్స్ యాజమాన్యాలు రోగి ఆస్తులను జలగల్లా పీల్చేస్తున్నారు. లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నారు. నానా రకాల పరీక్షలు, మందులు, చికిత్సల పేర్లు చెప్పి.. లక్షలకు లక్షలు లాగేస్తున్నారు. ఆ బిల్లులు కట్టకపోతే డెడ్‌బాడీనీ ఇవ్వమంటూ బెదిరించిన ఘటనలు అనేకం ఉన్నాయి.
ప్రైవేటు ఆసుపత్రుల రక్తదాహంపై హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా సర్కారు పట్టించుకోనేలేదు. ప్రైవేటు చికిత్స ఫీజులను ప్రభుత్వమే ఖరారు చేయాలన్నా పాలకులు ముందుకురాలేదు. ఇక ఇప్పుడిప్పుడే కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండటం.. ప్రైవేటు హాస్పిటల్స్‌కూ బిజినెస్ డల్ కావడంతో.. చేతులు పూర్తిగా కాలాక.. ఇప్పుడు ఆకులు పట్టుకుంటోంది ప్రభుత్వం. తాజాగా, ప్రైవేట్ ఆసుపత్రిలో కొవిడ్ చికిత్స ధరలు ఖరారు చేసింది తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ. ఆ మేరకు జీవో 40 విడుదల చేసింది. హైకోర్టు ఎప్పుడో హెచ్చరించినా సర్కారు మాత్రం ఇంత ఆలస్యంగా స్పందించడం అనుమానాలకు తావిస్తోంది. మెడికల్ మాఫియా ఒత్తిడి వల్లే ఇంత ఆలస్యం చేశారంటూ విమర్శలు వస్తున్నాయి.
ప్రభుత్వం ఖరారు చేసిన తెలంగాణలోని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కొవిడ్ చికిత్సల కనిష్ట, గరిష్ట ధరలు ఇలా ఉన్నాయి...
--జనరల్ వార్డులో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు గరిష్టంగా రూ.4వేలు మాత్రమే వసూలు చేయాలి.
--ఐసీయూ అయితే రోజుకు మాగ్జిమమ్ రుసుము రూ.7,500
--వెంటిలేటర్‌తో ఐసీయూ చికిత్స అందిస్తే రోజుకు గరిష్టంగా రూ.9000 ఫీజు.
--హెచ్ఆర్ సీటీ రూ.1995, డిజిటల్ ఎక్స్‌రే రూ.1300, డీడైమర్ రూ.300, సీఆర్‌పీ రూ.500, ఎల్‌డీహెచ్ రూ.140 మాత్రమే వసూలు చేయాలి.
--అంబులెన్స్‌కు కి.మీ.కు రూ.75 చొప్పున.. కనీసం 2వేలు వసూలు చేసుకోవచ్చు. అదే ఆక్సిజన్, వెంటిలేటర్ వసతి ఉన్న అంబులెన్సులకైతే కి.మీ. 125 చొప్పున కనీస బిల్లు 3వేలు తీసుకోవచ్చు.


