TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మళ్లీ వివాదాల తుట్టె కదిపిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ!

Published on: Wed Jun 22, 2022 2:03PM

నిత్యం వార్తల్లో ఉండాలంటే వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలి. అలా చేయకపోతే జనం మర్చిపోతారు. చాలా మంది రాజకీయ వేత్తలు ఇలాగే భావిస్తుంటారు. ముఖ్యంగా వైసీపీకి చెందిన వారైతే మరీను. అయితే ఆ వివాదాలే.. వారి మెడకు చుట్టుకుని అనివార్యంగా మౌనమే మేలనుకునే స్థితికి చేరుకుంటారు. వైసీపీలో నిన్న మొన్నటి దాకా ఓ వెలుగు వెలిగిన మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్,  కురసాల కన్నబాబు.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దదిగానే ఉంటుంది. కానీ వీళ్లెవరూ కాకుండా వైసీపీలో ఓ వెలుగు వెలిగి.. హఠాత్తుగా మసకబారిపోయిన మరో క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టరే ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, నటుడు పృధ్వీ.

గత ఎన్నికల ముందు వైసీపీలో పృధ్వీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అంతా తానే, అన్నీ తానే అన్నట్లుగా చెలరేగిపోయాడు. అలా చెలరేగి పోయి, విపక్షంపై విమర్శలతో విరుచుకుపడి జగన్ కళ్లల్లో పడి  తిరుమల శ్రీవారి చానల్ ఎస్వీబీసీ చైర్మన్ పదవి దక్కించుకున్నాడు. అయితే ఆ తరువాత కూడా తన నోరును అదుపులో ఉంచుకోవడంలో పూర్తిగా విఫలమైన పృధ్వి తన చేష్టలు, తీరుతో పూర్తిగా అప్రదిష్ట పాలకు కావడమే కాకుండా.. పదవి నుంచి సైతం ఉద్వాసనకు గురయ్యారు. ఇది జరిగి చాన్నాళ్లైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆయనకు నోరెత్తేందుకు కూడా ధైర్యం చాలలేదు. మౌనమే భూషణమని భావించి మిన్నకున్నారు. కానీ తిట్టే నోరూ, తిరిగే కాలూ ఊరుకోవంటారు. పృధ్వీ పరిస్థితీ అలాగే ఉంది. వైసీపీ అండ చూసుకుని ఇష్టారీతిగా చెలరేగిపోయిన పృధ్వీ రాజకీయాలలోనే కాదు.. సినిమాల్లోనూ చెల్లని కాసుగా మారిపోయాడు.

ఇంత కాలం అదే పరిస్థితి. అటు సినిమా వాళ్లూ దగ్గరకి చేరనీయలేదు..ఇటు రాజకీయాలకూ పనికి రాని వాడిగా మిగిలిపోయాడు. ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు కూడదీసుకుని మళ్లీ రాజకీయాలలోనూ, సినిమాల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు. అటైనా..ఇటైనా  పునర్వైభవం సంపాదించుకోవడం పృధ్వికి అంత సులువు కాదని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన తన పాత పృధ్వి గుర్తుకు వచ్చేలా విమర్శల పంచులు వదిలాడు. అయితే ఈ సారి విపక్షాల మీద కాదు.. ఇంత కాలం తాను ఏ పార్టీలో ఉన్నాడో, ఏ పార్టీ అండ చూసుకుని చెలరేగి కనుమరుగయ్యాడో ఆ పార్టీ మీదే.. ఆ పార్టీ అధినేత మీదే.  పిలిస్తే మళ్లీ వైసీపీలోకి వెళతారా అన్న ప్రశ్నకు ఆయన ఓ దణ్ణం పెట్టేశాడు. సిగ్గూ శరం, బుద్ధి, జనం ఉన్న వారెవరూ వైసీపీలోకి వెళ్లరని ఓ స్టేట్ మెంట్ విసిరాడు.

అదే సమయంలో తాను ఇంత కాలం ఎవరినైతే విమర్శించాడో.. ఆ పవన్ కల్యాణ్ ను పొగడ్తలతో ముంచెత్తారు. పృధ్వీ యూటర్న్ తీసుకోవడానికి రెడీ అయ్యాడన్న ఊహాగానాలకు ఆయన వ్యాఖ్యలు దోహదం చేశాయి. ఇక్కడే విమర్శకులు యూ టర్న్ తో పృధ్వి తన గతాన్ని కడిగేసుకోగలడా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  ఒక‌ప్పుడు వైసీపీ అధినేత ఏపీ సీఎం జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితంగా ఉన్నారు. ఆ సమయంలో తన స్థాయి, పరిధి మరచి ఇష్టారీతిన విమర్శలు, వ్యాఖ్యలూ చేశారు. జనసేనాని పవన్ కల్యాణ్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఇప్పుడు అందుకు పశ్చాత్తాప పడుతున్నానంటున్నాడు. తత్వం బోధపడిందని చెప్పుకుంటున్నాడు. ఆయన మాటలూ, తీరూ అన్నీ కూడా మరోసారి రాజకీయాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని పృధ్వి భావిస్తున్నారని  తెలియజేస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.

అయితే ఈ సారి వైసీపీ నుంచి కాకుండా జనసేన నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నట్లు పరిశీలకుల అంచనా. అటు ఉండాలంటే ఇటు తిట్టాలి. ఇటు ఉండాలంటే అటు తిట్టాలి అన్న సూత్రం మాత్రం తత్వం బోధపడిందంటున్న  పృధ్వికి పూర్తిగా అర్ధమైనట్లు లేదని పరిశీలకులు అంటున్నారు. వైకాపాలో ప్రభ వెలుగుతున్న కాలంలో జనసేనపైనా, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైనా ఇష్టారీతిగా నోరు పారేసుకున్న పృధ్వీరాజ్ ఇప్పుడు అదే పవన్ కల్యాణ్ పంచన చేరడానికి యత్నిస్తున్నారన్న విశ్లేషణలు చేస్తున్నారు. తనకు కుల పిచ్చి లేదంటూనే తూర్పుగోదావరి జిల్లా చొళ్లంగిలో పుట్టిన కాపు బిడ్డనని చెబుతున్నారు. సిగ్గూ, శరం ఉన్న వారెవరూ వైసీపీ వైపు చూడరని, తానూ చూడదలుచుకోలేదని కుండబద్దలు కొట్టేశారు. ఆయన ఇంటర్వ్యే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఓ రెంజ్ లో పృధ్వీని ట్రోల్ చేస్తున్నారు.