జైల్లో ఉంటూ ఐఐటీ ర్యాంక్.. సినిమా కాదు రియల్ స్టోరీ..
Published on: Fri Mar 25, 2022 12:20PM
లక్షలకు లక్షలు ఫీజులు కడతారు. పిల్లలను మెరుగైన స్కూల్స్, కాలేజేస్‌లో చదివిస్తారు. బట్టలు, పుస్తకాలు, కంప్యూటర్, సెల్‌ఫోన్, ట్యాబ్ అన్నీ కొనిస్తారు. వేళకు సరైన ఆహారం, ఆదివారాలు ఔటింగ్.. ఇలా ఏ లోటూ లేకుండా పెంచుతారు. పిల్లలు బాగా చదువుకోవాలని, మంచి ర్యాంక్ సాధించి.. మంచి కోర్స్ చేసి.. మంచి జాబ్ కొట్టి.. లైఫ్‌లో ఫుల్‌గా సెటిల్ కావాలని కోరుకుంటారు. కానీ, వంద మందిలో 90 మందికి అసలు చదువే ఒంటబట్టదు. ర్యాంకులే రావు. ఏదో చదివామా.. ఏదో ఒక ర్యాంక్ వచ్చిందా.. ఎక్కడో అక్కడ ఉద్యోగం సంపాదించామా.. ఇంతే. అంతకుమించి ఇంకేమీ ఉండదు. కొద్దిమంది మాత్రం చదువుల్లో రాణిస్తారు. పుట్టుకతోనే వారు సరస్వతీ సంతానం. ఏ వసతీ లేకుండా.. ఎన్ని కష్టాల్లో ఉన్నా.. ర్యాంకులు కొల్లగొడుతుంటారు. అలాంటి రేరెస్ట్ ఘటన ఒకటి ఇటీవల జరిగింది. ఓ మర్డర్ కేసులో విచారణ ఎదుర్కొంటూ.. జైల్లో ఉంటూ చదువుకొని ఐఐటీ ర్యాంక్ సాధించాడు ఆ ఒకటో నెంబర్ కుర్రాడు.
అతని పేరు కౌశ్లేంద్ర కుమార్ అలియాస్ సూరజ్. వయసు 22 ఏళ్లు. ఓ హత్య కేసులో 11 నెలలుగా జైలులో ఉంటున్నాడు. అరకొరా వసతుల మధ్యే చక్కగా చదివాడు. భవిష్యత్తుపై ఆశ కోల్పోకుండా.. పట్టుదలతో చెరసాలలోనే శ్రద్ధగా చదివాడు. మాస్టర్స్ డిగ్రీ సీటు కోసం ఐఐటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఐటీ జామ్) రాశాడు. ఫలితాల్లో సత్తా చాటాడు. జాతీయ స్థాయిలో 54వ ర్యాంకు సాధించాడు సూరజ్.
సూరజ్ బిహార్‌కు చెందిన వాడు. గతేడాది ఏప్రిల్ నుంచి ఓ హత్యకేసులో విచారణ ఖైదీగా ఉన్నాడు. అక్కడ ఉంటూనే చదువును కొనసాగించాడు. ఇటీవలే విడుదలైన ఐఐటీ రూర్కీ ప్రవేశపరీక్షలో సత్తా చాటి ఐఐటీ ర్యాంక్ సాధించాడు. జైల్లో ఉంటూ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయిన సూరజ్ ఇంత మంచి ర్యాంక్ సాధిస్తే.. ఇంట్లో ఉంటూ, అన్ని వసతులు ఎంజాయ్ చేస్తూ.. టాప్ కాలేజెస్‌లో చదువుకుంటున్న మిగతా వారు ఇంకెలా చదవాలి? ఎలా చదువుతున్నారు? అందుకే, సూరజ్ ఉదంతం విద్యార్థులందరికీ స్పూర్తి దాయకం.


