మోడీజీ..ఈ పని అప్పుడే చేసుంటే..?

ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్‌ సగం భారతీయుడని..విదేశాలకు అనుకూలంగా పనిచేస్తూ..భారతదేశం అభివృద్ది చెందకుండా అడ్డుకుంటోందని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి రాజేసిన చిచ్చు దేశ ఆర్థిక, రాజకీయ రంగాలలో పెను ప్రకంపనలు సృష్టించారు. రాజన్‌ను రెండోసారి కొనసాగిస్తారా..? లేదంటే ఉద్వాసన తప్పదా అని దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడిచింది. దీనిపై తీవ్ర మనస్తాపం చెందిన రాజన్ తాను రెండవసారి ఆర్‌బీఐ గవర్నర్‌గా కొనసాగలేనని స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్రమోడీ కనీసం మాట మాత్రంగానైనా స్పందించలేదు. ఇంత కాలం తర్వాత ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్‌ను మునగ చెట్టు ఎక్కించారు.

 

రాజన్‌తో తనకున్న అనుబంధం ప్రత్యేకమైనదని అన్నారు.. రాజన్ మనసు భారతీయమని..ఆయన అసలు సిసలు దేశ భక్తుడని కితాబిచ్చారు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే రాజన్ పనిని నేను ప్రశంసిస్తున్నా..ఆయన భారతదేశాన్ని ప్రేమిస్తారు...రాజన్ దేశభక్తిని ప్రేమించాల్సిన అవసరం లేదు. వివాదాలు రేకెత్తిస్తున్న వారు రాజన్‌కు హానీ చేస్తున్నారు అన్నారు.

 

అటు స్వామి ఆరోపణలు తప్పుబడుతూ  ప్రచారం కోసం పాకులాట వల్ల దేశానికి ఏ మాత్రం మంచి జరగదు. ఎవరికి వారు తమ బాధ్యతను గుర్తించి ప్రవర్తించాలి. వ్యవస్థ కంటే ఎవరు గొప్ప కాదు అని అన్నారు. మోడీ వ్యాఖ్యల పట్ల దేశంలో మిశ్రమ స్పందన వస్తోంది.  స్వామి ఆ స్థాయిలో విమర్శలు చేస్తున్న సందర్భంలో మోడీ కాస్త వెనకేసుకొచ్చినా బాగుండేదని..స్వామి కాస్త వెనకాడేవారని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. అటు రాజన్ కూడా తనకు ప్రధాని అండ ఉందన్న భావనతో ఉండేవారు.. మరి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు మోడీ ఎందుకు రియాక్ట్ అయినట్లు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇష్టానుసారంగా ఎవరిపై పడితే వారిపై ఆరోపణలు చేస్తున్న సుబ్రమణ్యస్వామి ప్రధాని వార్నింగ్‌తో కాస్త తగ్గే అవకాశం ఉంది.