మన "రక్షణ" విదేశాల చేతుల్లోకి..

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను దేశంలోకి ఆకర్షించడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం గేట్లను బార్లా తెరిచింది. ఇందుకోసం విమానయానం, సింగిల్ బ్రాండ్ రిటైల్, రక్షణ, ఫార్మాతో పాటు పలు రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనలను సడలిస్తూ ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం గతేడాది నవంబర్‌లో ఎఫ్‌డీఐ విధానాన్ని గణనీయంగా సరళీకరించగా..తాజాగా రెండోసారి అదే స్థాయిలో నిబంధనలను సరళతరం చేస్తూ సంస్కరణలను వేగవంతం చేసింది. ఆహార ఉత్పత్తుల ట్రేడింగ్, శాటిలైట్ ద్వారా నేరుగా ఇంటికే టీవీ ప్రసారాలు అందించే సంస్థల్లో, కేబుల్ టీవీ ప్రసారాలు, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, జంతు, మత్స్య పరిశ్రమల వృద్ధి దిశగా నూరు శాతం ఎఫ్‌డీఐలకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

 

ఇదంతా ఒక ఎత్తైతే దేశ భద్రతలో ముఖ్య భూమిక పోషించే అత్యంత కీలక రంగాలైన రక్షణ, విమానయాన రంగాల్లో నూరు శాతం విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరవడం సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు 49 శాతంగా ఉన్న ఈ రంగాల్లో పరిమితుల తొలగింపుతో విదేశీ కంపెనీలు, ఇండియాకు క్యూకట్టి ఇక్కడే ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని తయారు చేసుకునే వెసులుబాటు కలగనుంది.  నిన్న గాక మొన్న కొత్త పౌర విమానయాన పాలసీని ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం దీనికి మరింత ఊతమిచ్చేలా దేశీయ విమానయాన సంస్థల్లో విదేశీ సంస్థలు 100 శాతం వాటా కొనుగోలుకు మార్గం సుగమం చేసింది.

 

షెడ్యూల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్/దేశీయ షెడ్యూల్డ్ పౌర విమానయాన సేవల కంపెనీలు, ప్రాంతీయ విమాన సంస్థల్లో 100 శాతం ఎఫ్‌డీఐలకు అవకాశం కల్పించింది. అయితే, విదేశీ విమానయాన కంపెనీలకు ఈ అవకాశం లేదు. ఇతర రంగాలకు చెందిన కంపెనీలకు ఈ వెసులుబాటు కల్పించారు. 49 శాతం ఆటోమేటిక్ మార్గంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. అంతకు మించితే మాత్రం ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ షెడ్యూల్డ్ విమానయాన సేవల్లో 49% వరకే ఎఫ్‌డీఐలకు అవకాశం ఉంది. అయితే దీనిని కొంతమంది నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో అనధికార ఆయుధ తయారీదారులు కుటీర పరిశ్రమగా ఎదిగే ప్రమాదముందని అలాంటి ఆయుధాలు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళితే దేశ భద్రతకే పెనుముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరిస్తున్నారు.