ఇరాన్‌తో ఒప్పందం- పాకిస్తాన్‌కు చెక్

ఇరాన్‌లో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ఒక కీలకమైన ఒప్పందం మీద సంతకం చేశారు. ఇరాన్‌ తీర ప్రాంతంలోని చాబహర్‌ నౌకాశ్రయంలో మన దేశం మూడువేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడమే ఈ ఒప్పందంలోని సారాంశం. ఎక్కడో ఇరాన్‌లోని ఓ తీరం మీద మన దేశం ఇంత భారీ పెట్టుబడులు ఎందుకు పెడుతోంది? అంటే సహేతుకమైన జవాబులే వినిపిస్తాయి. పాకిస్తాన్‌ను ఆనుకుని ఉన్న ఇరాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ వంటి దేశాలలోకి వెళ్లాలంటే దారిలో ఉన్న పాకిస్తాన్‌ను దాటుకుని వెళ్లాల్సిందే! ఇందుకోసం ఆ దేశం సహజంగానే సవాలక్ష సవాళ్లను విసురుతుంది. అందుకే ఆఫ్ఘనిస్తాన్‌తో మన దేశం ప్రస్తుతం ఎలాంటి వ్యాపారమూ చేసే స్థితిలో లేదు.

 

 చాబహర్‌ నౌకాశ్రయం కనుక పూర్తయితే సముద్రమార్గం గుండా, చాలా తేలికగా ఆయా దేశాలకు రవాణాను సాగించవచ్చు. అంతేకాదు! ఈ నౌకాశ్రయంతో పెరిగే రాకపోకల వల్ల ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాన్‌, భారతదేశాల మధ్య బంధం మరింత దృఢపడనుంది. నిజానికి ఇరాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌లు ఇస్లాం దేశాలే అయినప్పటికీ... పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదంతో, ద్వంద్వ నీతితో తలబొప్పి కట్టించుకున్నవే. అందుకే ఆ రెండు దేశాలూ కూడా ఇండియా పట్లే ఎక్కువ మొగ్గు చూపుతాయి. ఇక చాబహర్ పోర్టుతో చైనా మీద కూడా మన దేశం పై చేయి సాధించినట్లయ్యింది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రాంతంలో ఉన్న గ్వదర్‌ అనే తీర ప్రాంతంలో చైనా తిష్ట వేసింది. అక్కడ ఓ భారీ నౌకాశ్రయాన్ని నిర్మించి మన దేశానికే సవాలు విసురుతోంది. ఇప్పుడు గ్వదర్‌కు కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాబహర్‌లో మన దేశం పోర్టుని నెలకొల్పి ఆ సవాలుకి దీటైన జవాబుని అందించనుంది.