TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పార్లమెంటులో వైఫల్యంపై మోడీ సీరియస్.. నష్టనివారణ చర్యలకు శ్రీకారం.!

Published on: Fri Aug 14, 2026 9:37AM

పార్లమెంటు సమావేశాల నిర్వహణలో మోడీ సర్కార్ విఫలమైంది. చట్టాలను  ఆమోదింపజేసుకోవడంలో  ప్రతిబంధకాలు ఎదురుకావడంతో కేంద్రం చేతులెత్తేసింది. జన్ జీ ఉద్యమంతో తొలి ఎదురుదెబ్బ తిని కేంద్ర మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్న  మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఎన్డీయే సర్కార్.. ఆ వెంటనే పార్లమెంటులో విపక్షాల ఐక్య ఆందోళనలు, ప్రతిఘటనతో  కీలక బిల్లుల   విషయంలో వెనక్కు తగ్గక తప్పలేదు.

దీంతో సమావేశాలు వాయిదా పడిన వెంటనే కేంద్రం నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది.  ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరింత పకడ్డందీగా ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు పార్టీ సంస్థాగత మార్పులతో పాటు.. తన కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కూడా తక్షణావసరంగా భావిస్తున్నారు. బీజేపీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు నరేంద్ర మోదీ  త్వరలోనే.. కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించనున్నారు. అలాగే పార్టీలో కూడా సంస్థాగత మార్పుల దిశగా కసరత్తు చేస్తున్నారు. 

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విదేశీ విరాళాల నియంత్రణ చట్ట (ఎఫ్సీఆర్ఏ) సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన  బిల్లు వంటి కీలకమైన, ప్రాధాన్యత కలిగిన బిల్లుల విషయంలో ప్రభుత్వం అడుగు ముందుకు వేయలేకపోయింది. ఎఫ్‌సీఆర్‌ఏ సవరణలపై ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాల నుంచి   నిరసన వ్యక్తం కావడంతో అనివార్యంగా ఆ బిల్లును పక్కన పెట్టాల్సిన అనివార్య పరిస్థితి ప్రభుత్వానికి ఎదురైంది.  

అలాగే..  డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్న.. తరుణంలో తమిళనాడు అసెంబ్లీ ఈ విధానానికి వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించింది. దీంతో కేంద్రానికి పరోక్షంగానైనా  మద్దతుఇస్తుందనుకున్న దనుకున్న డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలు కూడా వెనకడుగు వేశాయి. దీంతో ఈ బిల్లు విషయంలోనూ మోడీ సర్కార్ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. 

అలాగే పార్లమెంట్ ఉభయ సభలలోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా విపక్షాలన్నీ తమతమ విభేదాలను పక్కన పెట్టి మోడీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చి నిలబడటంతో సభా కార్యక్రమాలు స్తంభించిపోయాయి. సభలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విపక్షాలు సమైక్యంగా నిలదీస్తున్నా, సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నా..  అతి కొద్ది మంది సీనియర్లు వినా.. బీజేపీ సభ్యులెవరూ విపక్షాల విమర్శలను తిప్పి కొట్టేందుకు పెద్దగా ముందుకు రాలేదు. ఇది బీజేపీ అధిష్ఠానాన్ని తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. 

దీంతో ఇటు కేబినెట్, అటు పార్టీ సంస్థాగత నిర్మాణంలో సమూల మార్పులు అనివార్యమని ప్రధాని మోడీ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ నెలాఖరు నాటికి కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణతో పాటు  పార్టీ బాధ్యతల్లోనూ భారీ మార్పులూ, చేర్పులూ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాల్లోనే గట్టిగా వినిపిస్తోంది.   మొత్తానికి పార్లమెంట్ సమావేశాల్లో ఎదురైన ఆటంకాలను పరిగణనలోనికి తీసుకుని, పార్టీని, ప్రభుత్వాన్ని  బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

Prime Minister Narendra Modi, Union Cabinet reshuffle, Parliament sessions, BJP organizational changes