TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోడీ విమానంలో డమ్మీ గ్రెనేడ్ నిజమే!

Published on: Sun Oct 5, 2014 12:40PM

 

ప్రధాని మోడీ అమెరికా ప్రయాణానికి సిద్దంగా ఉంచిన 'స్టాండ్-బై' ఎయిర్ ఇండియా విమానంలో నిర్వీర్యం చేయబడిన గ్రెనేడ్ దొరకడం కలకలం రేపింది. ప్రధాని మోడీ తమ అమెరికా పర్యటన ముగించుకొని వచ్చేసిన తరువాత ఆ విమానాన్ని యన్.యస్.జీ. కమెండోలు ‘యాంటీ-హైజాక్-ఆపరేషన్స్-శిక్షణ' నిమిత్తం తమ అధీనంలో తీసుకొన్నారు. ఆ తరువాత దానిని తిరిగి ఎయిర్ ఇండియాకు అప్పగించారు. కానీ అందులో తేఖాన్పూరు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తయారుకాబడినట్లు ముద్ర ఉన్న ఒక ‘స్టన్-గ్రెనేడ్’ ఒకటి వదిలివేశారు. వారు దానిని అందులో పెట్టి పొరపాటున మరిచిపోయారా? లేక కోరుండే వదిలిపెట్టారా? అనే సంగతి ఇంకా తేలవలసి ఉంది.

 

ఆ నిర్వీర్యమయిన గ్రేనేడ్ విమానంలో ఉండగానే డిల్లీ, ముంబై, హైదరాబాదులలో ప్రయాణికులను ఎక్కించుకొని సౌదీ అరేబియాలోని జెడ్డా అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకొంది. అక్కడ జరిగిన తనికీలలో విమానంలో స్టన్-గ్రెనేడ్ ఉన్న సంగతి బయటపడింది. అయితే ఎయిర్ ఇండియా అధికారులు ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు అదే గ్రెనేడ్ కాదని కేవలం పనికిరాని ప్లాస్టిక్ వస్తువని నమ్మబలికే ప్రయత్నం చేసారు. కానీ అది ఒక నిర్వీర్యం చేయబడిన ‘స్టన్-గ్రెనేడ్’ అని యన్.యస్.జీ. కమెండోలు నిర్దారించడంతో, ముంబై, హైదరాబాదుల విమానాశ్రయాలలో ఎయిర్ ఇండియాకు చెందిన నలుగురు అధికారులు, ఇద్దరు సెక్యురిటీ అధికారులు సస్పెండ్ చేయబడ్డారు.

 

డిల్లీలో విమానం బయలుదేరినప్పటి నుండి జెడ్డా చేరేవరకు ప్రతీ విమానాశ్రయంలో కూడా సెక్యూరిటీ అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అందులో ఎటువంటి ప్రమాదకర వస్తువులు లేవని నిర్దారించుకొన్న తరువాతనే ప్రయాణానికి అనుమతిస్తుంటారు. అయితే బోయింగ్ 747వంటి భారీ విమానాన్ని కేవలం ఒకే ఒక్క సెక్యూరిటీ అధికారి మొక్కుబడిగా పరిశీలించి, క్లియరెన్స్ ఇస్తుండటం చేతనే ఈవిధంగా జరిగిఉండవచ్చని దర్యాప్తు చేస్తున్న అధికారులు అభిప్రాయపడుతున్నారు.

 

కేంద్ర విమానయాన శాఖామంత్రి అశోక్ గజపతి రాజుకు ఈ విషయం తెలిసిన వెంటనే దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ఎయిర్ ఇండియా డిప్యూటీ చీఫ్ సయ్యద్ నసీర్ అలీ, విమానయాన భద్రతాధికారి బిబి.దాస్ లతో కూడిన ఒక కమిటీని వేసారు. ఏమయినప్పటికీ ఈ వ్యవహారం వలన మన భద్రతా వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో కళ్ళకు కట్టినట్లు చూపుతోంది.