కొవిషీల్డ్, కొవాగ్జిన్ భారీ డిస్కౌంట్.. టీకా ధర తగ్గించిన కంపెనీలు..
Published on: Sat Apr 9, 2022 7:21PM
ఒమిక్రాన్ XE ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రికాషన్ డోసుకి కేంద్రం అనుమతి ప్రకటించింది. ఏప్రిల్ 10 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరూ ప్రికాషన్ డోసు తీసుకోవచ్చు. కాకపోతే ఈసారి ఉచితంగా టీకా ఇవ్వరు. కావాలనుకున్నవారు ప్రైవేట్‌లో వ్యాక్సిన్ వేయించుకోవాలి. అయితే, అది ఖరీదైన వ్యవహారం కావడంతో ఒక్కరోజులోనే విమర్శలు వచ్చాయి. దీంతో, టీకా తయారీ కంపెనీలే దిగొచ్చాయి. 600-1200 వరకూ ధర పలికే కొవాగ్జిన్, కొవిషీల్డ్ డోసును.. జస్ట్ రూ.225కే ఇస్తామంటూ భారత్ బయోటెక్, సీరమ్ సంస్థలు ముందుకొచ్చాయి. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకా ధరలను భారీగా తగ్గించాయి.
ప్రైవేటు ఆసుపత్రులకు కొవిషీల్డ్ డోసు ధరను రూ.600 నుంచి రూ.225కు తగ్గిస్తున్నట్లు సీరమ్ సీఈఓ అదర్ పూనావాలా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇక, కొవాగ్జిన్ టీకా డోసు ధరను రూ.1200 నుంచి రూ.225కు తగ్గిస్తున్నట్టు భారత్ బయోటెక్ జాయింట్ ఎండీ సుచిత్ర ఎల్లా వెల్లడించారు.
అయితే ఈ వ్యాక్సిన్ ధరలకు సర్వీస్ ఛార్జీలు అదనం. సర్వీస్ ఛార్జీ గరిష్ఠంగా రూ.150 మాత్రమే తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకా ధరలు గరిష్ఠంగా రూ.375 (సర్వీసు ఛార్జీలు కలుపుకుని) ఉండనున్నాయి.
రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన వారు ప్రికాషన్ డోసుకు అర్హులు. మూడో డోసు కోసం మళ్లీ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. 'కొవిన్' యాప్‌లోకి వెళ్లి ప్రికాషన్ డోసు కోసం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. లేదంటే, డైరెక్ట్‌గా మీ సమీపంలోని ప్రైవేటు కేంద్రాలకు వెళ్లి టీకా తీసుకోవచ్చు. తొలి రెండు డోసులు ఏ రకం టీకా అయితే తీసుకున్నారో ప్రికాషన్ డోసు కూడా అదే తీసుకోవాలి. అంటే.. తొలి రెండు డోసులు కొవాగ్జిన్ తీసుకున్నవారు.. మూడో డోసు కూడా కొవాగ్జినే వేయించుకోవాలి. తొలి డోసులు కొవిషీల్డ్ తీసుకుంటే.. ప్రికాషన్ డోసు కూడా కొవిషీల్డే తీసుకోవాలి. వేరే కంపెనీ వ్యాక్సిన్‌లు తీసుకోకూడదు.


