పార్టీలకు ప్రతిష్టగా మారిన రామచంద్రాపురం
Published on: Mon May 7, 2012 9:59AM
కాంగెస్, టిడిపి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలకు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ మూడు పార్టీల జిల్లా నాయకులు, క్యాడర్ అంతా ఈ నియోజకవర్గంపై దృష్టి సారించాయి. అన్నిపార్టీల నాయకులూ గ్రామ గ్రామాన గడప గడపకు తిరుగుతున్నారు.
సర్వేల ఫలితాలు తెలుసుకుంటూనే అభ్యర్థులూ ఏ ఒక్క గ్రామాన్ని వదలటం లేదు. ఇక్కడ కాంగ్రస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, తెలుగుదేశంపార్టీ తరపున మాజీమంత్రి చిక్కాల రామచంద్రరావు, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున మాజీమంత్రి, తజామాజీ పిల్లి సుభాష్ చంద్రబోస్ రంగంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బిసి ఓటర్లు ఎక్కువ. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో కాంగ్రెస్, టిడిపి తరపున కాపు సామాజికవర్గం అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోసు బిసి సామాజికవర్గం నుంచి రంగంలో ఉన్నారు. దీంతో బిసిలందరూ ఈయనకు మద్దతు ఇస్తున్నారు.
ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కూడా ఈ నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రులు తోట నర్సింహం, పినిపే విశ్వరూప్ తదితరులు కాంగ్రెస్ తరపున ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ తరపున ఆ పార్టీ జిల్లా క్యాడర్ ప్రచారం చేస్తోంది. తెలుగుదేశంపార్టీ తరపున మాజీ జెడ్.పి.టి.సి. పిల్లి సత్తిబాబు కూడా చిక్కాల తరపున మొత్తం క్యాడర్ ను నియోజాగావర్గ ప్రచారానికి వినియోగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వచ్చే ఫలితాల ఆధారంగానే రాష్ట్రంలో అధికారం ఉంటుందన్న సెంటిమెంటు కూడా ఈ నియోజకవర్గం ప్రధానపార్టీల దృష్టి సారించాతానికి కారణమైంది.


