కంప్రెస్, సప్రెస్ అయిపోతోన్న ప్రెస్ ఫ్రీడమ్…

మే 1 లేబర్ డే! ఇది అందరికీ తెలిసిందే! కాని, మే 3 ఏంటో తెలుసా? వాల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే! ఈ విషయం చాలా మంది జర్నలిస్టులకి కూడా తెలుసో లేదో! కాని, మే 3ని ప్రపంచ వ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన దినంగా అధికారికంగా జరుపుతున్నారు ఎన్నో ఏళ్లుగా! అయితే, పత్రికలతో మొదలై ఇవాళ్ల టెలివిజన్, వెబ్ జర్నలిజం, సోషల్ మీడియా సైట్లతో కలిపి మీడియా ఎంతో విస్తరించింది. మరి ప్రెస్ ఫ్రీడమ్ సంగతో? అది మాత్రం అంతకంతకూ కుంచించుకుపోతోంది!

 

వాల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే సందర్భంగా ఒక్కసారి ప్రపంచాన్ని పరికిస్తే జర్నలిస్టుల భద్రత, సంరక్షణ ఎంత బాగా వున్నాయో ఇట్టే అర్థమైపోతుంది! తన రహస్యాలు బయటపెట్టాడని అసాంజే మీద తప్పుడు కేసులు పెట్టి వేటాడుతోన్న అమెరికా మొదలు… జర్నలిస్టుల తలలు నరికేసే ఐఎస్ఐఎస్ వరకూ అంతటా, అందరూ అదే టైపు! క్రూరత్వంలో కాస్త అటు ఇటూ తప్ప పత్రికా స్వేచ్ఛని ధైర్యంగా అంగీకరించే వ్యవస్థ ఎక్కడా లేదు! ఇందుకు మన దేశమూ అతీతం కాదు! ది హూట్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో ఇండియా ప్రెస్ ఫ్రీడమ్ విషయంలో 136వ ర్యాంక్ సంపాదించుకుంది! మొత్తం ర్యాంక్ లు పొందిన దేశాలెన్ననుకున్నారు? 180!

 

180 దేశాల్లో 136వ స్థానంలో భారత్ నిలిచిందంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు! అందుకు తగ్గట్టే సంఖ్యలు కూడా కనిపిస్తాయి మనకు! జనవరి 2016 నుంచీ ఏప్రెల్ 2017వరకూ జర్నలిస్టుల మీద యావత్ దేశంలో 54దాడులు జరిగాయి! ఏడుగురు పాత్రికేయులు హత్యకి గురయ్యారు కూడా! ఇదంతా కేవలం పోలీస్టేషన్ల దాకా వచ్చిన కేసుల సారాంశమే! అసలు రిపోర్ట్ అవ్వని దాడులు, మర్డర్లు ఇంకా ఎన్నో!

 

ఇంతకీ, పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగేలా జర్నలిస్టుల మీద దాడులు చేస్తున్నది ఎవరు? చాలా మంది! పొలీసులు, పొలిటికల్ లీడర్లు, వారి అనుచరులు, వివిధ రంగాల్లోని మాఫియాలో వున్న కరుడుగట్టిన నేరగాళ్లు, నిరసనలు, ధర్నాలు చేసే జనాల గుంపులు, చివరకు, లాయర్లు కూడా ఈ లిస్ట్ లో వున్నారు! మీడియా, జర్నలిస్టులు అన్నివేళలా కరెక్టే అని మనం చెప్పకున్నా… దాడుల్ని మాత్రం సమర్థిచలేం. కాని, జరుగుతున్నది మాత్రం అదే! రోజు రోజుకి పత్రికా స్వేచ్ఛ పట్ల అసహనం పెరిగిపోతోంది! పాలకులు మొదలు సామాన్య జనం దాకా అందరికీ ఏదో ఒక సమయంలో ప్రెస్ అంటే కోపం తన్నుకొస్తోంది!

 

మీడియా పై దాడులు ప్రతీ యేడూ పెరగటానికి అసలు కారణం… దాడి చేసిన వారి అరెస్ట్ విషయంలో జరుగుతోన్న జాప్యం, అలసత్వం! 2014లో మీడియా పై జరిగిన దాడులకు సంబంధించి 114కేసులు నమోదైతే… కేవలం 32మందిని మాత్రమే అరెస్ట్ చేయటం జరిగింది! దీని వల్ల కూడా పత్రికా స్వేఛ్ఛకు భంగం కలిగించే వారిలో భయం కొంచెం కూడా లేకుండాపోతోంది.

 

దేశ వ్యాప్తంగా వివిధ ఛానల్స్ , పత్రికలు నిషేధానికి గురవ్వటం కూడా ఈ మధ్య పెరిగిపోయిందట! మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఛానల్స్ రోజుల తరబడి జనాలకు అందుబాటులో లేకుండా పోవటం మనకు తెలిసిందే! ఇక కేరళ మొదలు కాశ్మీర్ దాకా అంతట ఒకేలాంటి పరిస్థితి వుందని చెబుతున్నాయి రిపోర్ట్స్! నిత్యం అల్లర్లతో అట్టుడికే కాశ్మీర్లో అయితే ప్రెస్ ఫ్రీడమ్ మరింత దుర్భరంగా వుంటోంది. కాశ్మీర్ రీడర్ అనే పత్రికని ఏకంగా మూడు నెలలు అచ్చవ్వకుండా బ్యాన్ చేశారు! దీని వెనుక కారణాలు, వివరణలు ఎలా వున్నా పత్రికా స్వేచ్ఛకి మాత్రం ఇది తీవ్రమైన భంగమనే చెప్పాలి!

 

పత్రికలు, ఛానల్స్ మాదిరిగానే ఇంటర్నెట్ కూడా పదే పదే నిషేధానికి గురవుతోంది వివిధ రాష్ట్రాల్లో. ఫేస్బుక్, వాట్సప్ పోస్టులు కూడా హింసకు, అల్లర్లకు దారి తీస్తుండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి భద్రతల కోసం ఇంటర్నెట్ బ్యాన్ చేసేస్తున్నాయి. ఈ విషయంలో కూడా రాళ్ల దాడులతో సతమతం అవుతోన్న కాశ్మీర్ ముందంజలో వుంది!

 

మీడియాని తొక్కిపెట్టే క్రమంలో సినిమాకి కూడా సెగ తగులుతోంది. సెన్సార్ బోర్డ్ కత్తెర ముందు గజగజ వణికిపోతోన్న సినిమాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దక్షిణాదిలో కమల్ హసన్ విశ్వరూపం సినిమాకు రకరకాల ఇబ్బందులు ఎదురుకావటం మనకు తెలుసు. అలాగే, పంజాబ్ ఎన్నికలకు ముందు ఉడ్తా పంజాబ్ సినిమాకి కూడా సెన్సార్ బోర్డ్ చుక్కలు చూపింది. ఇలా రాష్ట్ర స్థాయిలో , జాతీయ స్థాయిలో రోజూ ఏదో ఒక సినిమా అవాంతరం ఎదుర్కుంటూనే వుంది! ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ కి చాలా పెద్ద దెబ్బ!

 

మీడియా సంస్థలు, జర్నలిస్టులు, సినిమాలు మాత్రమే కాదు… వివిధ రంగాల్లో ఒంటరి వ్యక్తులు కూడా అంతకంతకూ స్వేచ్ఛకి దూరమవుతున్నారట! ఏకంగా ప్రభుత్వాలే దేశ ద్రోహం కేసులు, పరువు నష్టం కేసులు వేస్తున్నాయి తమకు నచ్చని వారి మీద! తమిళనాడు ప్రభుత్వం అత్యధికంగా 16కేసులు పెట్టిందట మీడియా మీద! అదీ ఈ సంవత్సరం ప్రారంభంలో కేవలం మూడు నెలల్లోనే! ఈ విధంగా కక్ష సాధింపుకి అస్త్రాలుగా మారిపోయాయి దేశ ద్రోహం, పరువు నష్టం కేసులు!

 

జనాలని సమాచారానికి దూరం చేస్తోన్న మరో దారుణమైన పరిణామం ఆర్టీఐ యాక్టివిస్టుల మర్డర్లు! సమాచార హక్కు చట్టం ఉపయోగించి నిజాలు వెలికితీసే సాహసం చేసిన చాలా మంది అనుమానాస్పద మరణాలకి గురవుతున్నారు. నానాటికీ ఈ కేసుల సంఖ్య ఆర్టీఐ ఉద్దేశాన్ని నీరుగార్చేస్తోంది. ప్రాణాలకు తెగించిన వారు తప్ప మామూలు జనం ఆర్టీఐ జోలికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది!

 

ప్రజాస్వామ్యం అంటేనే స్వేచ్ఛ! ఆ స్వేచ్ఛకి భంగం కలిగేలా దేశం దయనీయ స్థితిలో వుంటే అది అందరికీ ప్రమాదకరమే! అందుకే, ప్రజలు చైతన్యవంతంగా మారి పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవాలి. లేదంటే దీర్ఘకాలంలో మన ప్రజాస్వామ్య వ్యవస్థ మొత్తం అర్థం లేనిదైపోతుంది!