TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల .. 18న పోలింగ్.. 21న ఓట్ల లెక్కింపు

Published on: Thu Jun 9, 2022 4:43PM

దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రపతిపై సార్వత్రిక ఎన్నికలలో ఉండే ఆసక్తి ఉత్కంఠ నెలకొంది. 

రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం గురువారం  విడుదల చేసిన షెడ్యూల్ మేరకు రాష్ట్రపతి ఎన్నికతో పాటే ఉప రాష్ట్రపతి ఎన్నికా జరుగుతుంది. రాష్ట్రపతి  ఎన్నికకు జూన్ 15న  నోటిఫికేషన్ విడుదల అవుతుంది.  నామినేషన్ల దాఖలుకు జూన్ 29 చివరి తేది. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ జరుగుతుంది. అదే నెల 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రస్తుత  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం జూలై 24తో ముగియనుండడంతో  కొత్త రాష్ట్రపతి జూలై 25న ప్రమాణ స్వీకారం చేస్తారు.

రాష్ట్రపతి ఎన్నికతో పాటే ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ, కాంగ్రెస్‌లు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో పోటీ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది.   దేశంలోని పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉండే  ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. పార్లమెంటు ఉభయ సభల సభ్యులకు ఓటు వేసే హక్కు ఉంటుంది. అసెంబ్లీల విషయంలో ఎమ్మెల్యేలకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది.  ఎమ్మెల్సీలకు ఉండదు. ఎలక్టోరల్ కాలేజీలో ఉండే సభ్యుల ఓటుకు  ఓ విలువ ఉంటుంది. ఈ విలువ ఎంపీలకు ఒక విధంగా ఎమ్మెల్యేలకు మరో విధంగా  ఉంటుంది.  ఎలక్టోరల్ కాలేజీలో 4,896 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలు.  మొత్తం ఎలక్టోరల్ కాలేజీ  ఎలాక్టోరల్ కాలేజీ ఓట్ల విలువ 10.98.903 ఓట్లు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నది. బీజేపీకి సొంతంగా తాను నిలబెట్టే అభ్యర్థిని గెలిపించుకునేంత బలం ఎలక్టోరల్ కాలేజీలో లేకపోవడంతో అనివార్యంగా ఇతర పార్టీల మద్దతు పై ఆధారపడాల్సిన పరిస్థితి. ఇక విపక్షాలు కూడా బీజేపీ ఆధిపత్యానికి అడ్డు కట్ట వేయడానికి రాష్ట్రపతి ఎన్నికను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి. దీంతో ఈ సారి ప్రజలందరి దృష్టీ కూడా ఈ ఎన్నికలో ఎవరిది పై చేయి  అన్న విషయంపై ఉంది.  

ఇప్పటికీ అటు బీజేపీ కానీ, ఇటు విపక్షాలు కానీ రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయలేదు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు ప్రారంభించగా, బీజేపీయేతర పక్షాలు కాంగ్రెస్ ఖరారు చేసే అభ్యర్థి ఎవరన్న దానిపై దృష్టి సారించాయి. బీజేపీ యేతర పార్టీలతో చర్చించి అభ్యర్థిని ఖరారు చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ఉన్నట్లు చెబుతున్నారు. 

ఇక రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో బీజేపీ   పలువురి పేర్లు పరిశీలిస్తోంది. రాష్ట్రపతి అభ్యర్ధి విషయంలో అందరి ఊహలకు, అంచనాలకు అందకుండా తెరమీదకు తీసుకువస్తున్న బీజేపీ ఈ సారి కూడా అదే పంథాను అవలంబించాలని భావిస్తోంది.   2017లో అనూహ్యంగా రామ్ నాథ్ కోవింద్ ను అభ్యర్థిగా తెరపైకి తీసుకువచ్చిన కమలనాథులు ఈ సారి ఎవరిని రాష్ట్రపతి అభ్యర్థిగా రంగంలోనికి దింపుతారన్న విషయంలో సస్పెన్స్ నెలకొంది.  

బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఈ సారి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని రంగంలోనికి దింపే అవకాశం ఉందని కూడా పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తికి అవకాశం ఇచ్చే విషయాన్ని బీజేపీ అగ్రనాయకత్వం తీవ్రంగా పరిశీలిస్తోందంటున్నారు. ఎందుకంటే కర్నాటక వినా దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి ఇప్పటివరకూ పట్టు లేదు. ఈ సారి ఎలాగైనా దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయాలన్న పట్టుదలతో ఉన్న కమలనాథులు రాష్ట్రపతి అభ్యర్థిగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని రంగంలోనికి దింపే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

ఇక విపక్షాల నుంచి ఇప్పటి వరకూ ఉమ్మడ అభ్యర్థి   విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒకింత ప్రయత్నం చేసినా అది పెద్దగా కలిసి వచ్చినట్లు కనిపించడం లేదు.  దీంతో కాంగ్రెస్ ప్రతిపాదించే అభ్యర్థికే వపక్షాలు మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.