విభజన బిల్లుపై చర్చకు మరోవారం?

 

 

 

విభజన బిల్లుపై అభిప్రాయాలు తెలపటానికి శాసనసభకు ఇచ్చిన గడువును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరోవారం రోజులు పొడగించవచ్సుననే వార్తలు రాజకీయవర్గాలలో వినిపిస్తున్నాయి. తెలంగాణ బిల్లుపై అభిప్రాయాలు తెలపటానికి అసెంబ్లీకి రాష్ట్రపతి ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. బిల్లుపై సమగ్రాభిప్రాయం తెలుసుకునేందుకు 4 వారాలపాటు గడువును తప్పనిసరిగా పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి..రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్రపతికి లేఖలు రాశారు. దీంతో విభజన సందర్బాలలో అప్పటి రాష్ట్రపతులు పాటించిన సంప్రదాయాలను ప్రణబ్ మరోసారి పరీశీలిస్తున్నారు. చర్చకు మరింత సమయం ఇవ్వడంపై గురువారం రాష్ట్రపతి భవన్ అధికారిక వర్గాలు స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.

 

మరోవైపు గడువు పొడిగింపు అంశం అసెంబ్లీ లాబీల్లో హాట్ టాపిక్‌గా మారింది. పొడిగింపు వస్తుందా, రాదా, పొడిగించకపోతే ఎలా ఉంటుంది, పొడిగిస్తే ఎలా ఉంటుందన్న దానిపై అనేక రకాల కథనాలు, ప్రచారాలు జరిగాయి. రాష్ట్రాల విభజన సందర్భంగా ఆయా అసెంబ్లీలు చర్చకు గడువు పెంపు కోరినప్పుడు... రాష్ట్రపతి తిరస్కరించిన దాఖలాలు లేవని, ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ ఇదే జరుగుతుందని అనుకుంటున్నారు. అయితే ముఖ్యమంత్రి కోరినట్లు నాలుగు వారాలు కాకుండా, కనీసం ఒక్కవారం పెంచే అవకాశాలున్నాయని తెలిపారు.