TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్రపతి శీతాకాల విడిది రద్దు.. ఇక రామ్ నాథ్ హైదరాబాద్ రానట్టే! 

Published on: Mon Dec 27, 2021 11:30AM

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హైదరాబాద్  శీతాకాల విడిది పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు ఢిల్లీ రాష్ట్రపతి భవన్ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ప్రతి ఏడాది సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వస్తుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటనపై కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేసేందుకు ఆయన డిసెంబర్ చివరి వారంలో రానున్నారని రాష్ట్రపతి భవన్ ఇటీవల తెలిపింది

షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 29 నుంచి జనవరి 3వరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హైదరాబాద్ రావల్సి ఉంది. దీంతో  తెలంగాణ అధికారులు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. ఏర్పాట్లపై కంటోన్మెంట్‌, జీహెచ్‌ఎంసీ అధికారులతో మేడ్చల్‌ కలెక్టర్‌ హరీష్‌ సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. అయితే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది రద్దు అయ్యినట్లు తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్రపతి భవన్‌ సమాచారం అందించింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసు పెరుగుతుండటం, కొత్తగా ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డట్టు సమాచారం.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవి కాలం వచ్చే ఏడాది జూన్ 20తో ముగియనుంది. దీంతో ఇకపై రాష్ట్రపతిగా రాంనాథ్ కోవింద్ హైదరాబాద్ శీతాకాల విడిది లేనట్టే. ఆగస్టు 16, 2017లో భారత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు రామ్ నాథ్ కోవింద్. అయితే ఆయన హైదరాబాద్ విడిది మాత్రం మూడు సార్లు మాత్రమే జరిగింది. కరోనా కారణంగా 2020లో ఆయన హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. తాజాగా ఈ ఏడాది కూడా వాయిదా పడింది.