తెలంగాణ ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు.. రాష్ట్రపతి ఆగ్రహం!

 

తెలంగాణ ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యం కారణంగా 27 మంది ఇంటర్‌ విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పందించారు. వాస్తవ నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖను రాష్ట్రపతి ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి నివేదిక కోరుతూ కేంద్ర హోం శాఖ తెలంగాణ సీఎస్‌ ఎస్‌కే జోషికి లేఖ రాసింది.

ఇంటర్‌బోర్డు వైఖరిని నిరసిస్తూ, విద్యార్ధుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలోని బృందం ఈ నెల 1న రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం అందజేసింది. 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని, ఇంటర్‌ బోర్డు, గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోలేదని వివరించారు. ఆయా విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రపతి జోక్యాన్ని కోరడం తప్పించి మరో మార్గం లేదని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిగితేనే నిజానిజాలు బయటకు వస్తాయని భావిస్తున్నామని.. ఈ మేరకు గవర్నర్‌ను ఆదేశించాలని బృంద సభ్యులు రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ స్పష్టంగా నివేదిక ఇచ్చినా ఎవరిపైనా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. దీనిపై స్పందించిన రాష్ట్రపతి భవన్.. తక్షణమే ఈ ఘటనకు సంబంధించిన నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్ర హోంశాఖను, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.