ట్రంప్ కి సవాలు విసిరిన చంద్రబాబు
Published on: Sat Feb 4, 2017 2:16PM
.jpg)
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి తన ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. దీనిలో భాగంగా ఏడు ముస్లిం దేశాలకు చెందిన శరణార్థులు, పౌరులను అమెరికాలోకి అడుగుపెట్టకుండా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా హెచ్1బీ వీసాల మీద పరిమితులు విధించారు. మొదటి దాని కంటే రెండవ నిర్ణయం మాత్రం అమెరికా వెళ్లాలని కలలు గంటున్న యువతకు శరాఘాతంగా మారింది.
మరీ ముఖ్యంగా భారతీయుల్లో అమెరికా అంటే విపరీతమైన మోజు...అక్కడికి వెళ్లి నాలుగు డాలర్లు సంపాదించాలని ఆశపడని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు అధ్యక్షుల వారి నిర్ణయం భారతీయులకు ముఖ్యంగా తెలుగువారికి ఏమాత్రం మింగుడు పడటం లేదు. దేశం మొత్తం మీద తెలుగు రాష్ట్రాల నుంచే అత్యధిక సంఖ్యలో యువత అమెరికా వెళుతూ ఉంటారు. అందుకే శ్వేతాసౌధాధిపతి నిర్ణయం తెలుగువారిని కలవరపెడుతోంది. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా..ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించే టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యపైనా స్పందించారు.
ట్రంప్ నిర్ణయం ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది, ప్రధానంగా అమెరికాలో పనిచేస్తున్న భారతీయులకి. అయితే, భారతీయులు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు అస్సలు భయపడొద్దని చెప్తుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
"ట్రంప్ అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి భారతీయుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ప్రధానంగా, తెలుగు ఎన్‌ఆర్‌ఐలు గందరగోళంలో ఉన్నారు. నేను చెప్తున్నా.. ట్రంప్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తా. తెలుగు వారందరికీ మంచి జరిగేలా చూస్తా," అని అన్నాడు చంద్రబాబు.
కొన్ని లక్షల మంది అమెరికాలో పనిచేస్తున్నారని, ఒకేసారి వెళ్లిపొమ్మంటే ఎక్కడికి వెళ్తారని చంద్రబాబు ప్రశ్నించారు. అమెరికాకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం, అవసరమైతే భారత ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటాం అని చెప్పారు. అక్కడితో ఆగకుండా ఒక మంచి సలహా కూడా ఇచ్చారు బాబు గారు. అమెరికాకి గుణపాఠం చెప్పాలి అంటే మన ఉద్యోగాలు ఇక్కడే ఏర్పరచుకునే ప్రయత్నం చేయాలన్నారు.
ఇది నిజంగా జరిగే పనే అంటారా! జరిగితే మాత్రం ఒక విధంగా మంచిదే!


