TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్రపతి ఎన్నిక..అభ్యర్థి ఎవరన్నదానిపై ఉత్కంఠ

Published on: Tue Jun 7, 2022 11:10AM

సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం జనం ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తారో.. అంతకు మించి ఉత్కంఠ ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కనిపిస్తున్నది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం వచ్చే నెల 25తో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోరాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.

అయితే ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నిక కసరత్తును బీజేపీ ఆరంభించేసింది. విపక్షాలు సమైక్యంగా నిలిచి ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే ఎన్డీయే కూటమి అభ్యర్థిని రాష్ట్రపతిగా గెలిపించుకునేంత బలం లేని కారణంగా రాష్ట్రపతి ఎన్నికలో తన అభ్యర్థిని గెలిపించుకునేందుకు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలను ఆరంభించడంతో బీజేపీ ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల కసరత్తును మొదలెట్టేసింది.

ఇక రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా ఇప్పటికే పలువురి పేర్లు పరిశీలిస్తోంది. రాష్ట్రపతి అభ్యర్ధి విషయంలో అందరి ఊహలకు, అంచనాలకు అందకుండా తెరమీదకు తీసుకువస్తున్న బీజేపీ ఈ సారి కూడా అదే పంథాను అవలంబించాలని భావిస్తోంది. దీంతో బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని రంగంలోకి దింపుతుందన్న ఉత్కంఠ మధ్య పరిశీలకులు పలు విశ్లేషణలతో  మల్లగుల్లాలు పడుతున్నారు.

2017లో అనూహ్యంగా రామ్ నాథ్ కోవింద్ ను అభ్యర్థిగా తెరపైకి తీసుకువచ్చిన కమలనాథులు ఈ సారి ఎవరిని రాష్ట్రపతి అభ్యర్థిగా రంగంలోనికి దింపుతారన్న విషయంలో సస్పెన్స్ నెలకొంది. సామాజిక సమీకరణాలకు అనుగుణంగా ఈ సారి రాష్ట్రపతిగా గిరిజన మహిళను రంగంలోనికి దింపే అవకాశం ఉందన్న చర్చ కమల దళంలోనే సాగుతోంది. ఒక వేళ అదే జరిగితే రేసులో ముగ్గురు మహిళలు ఉండే అవకాశం ఉందంటున్నారు.  మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము, ఛత్తీస్ గఢ్ గవర్నర్ అనసూయ, కేంద్ర మంత్రిజ్యూయల్ఓరంల పేర్లు కేంద్రం పరిశీలనలో ఉన్నాయని చెబుతున్నారు.

. గిరిజనుల సంఖ్య ఎక్కువగా ఉన్న చత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు బీజేపీ చేజారిన  నేపథ్యంలో  రాష్ట్రపతి గా గిరిజన మహిళను ఎంపిక చేయడం ద్వారా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనతతో పాటు అత్యున్నత రాజ్యాంగ పదవిలో గిరిజనుడిని ఎంపిక చేసిన ఘనతనూ ఏకకాలంలో సొంతం చేసుకోవచ్చన్న వ్యూహంలో కమలనాథులు ఉన్నారన్న చర్చ జరుగుతోంది. ఇక ముస్లిం మైనారిటీలకు వ్యతిరేక పార్టీగా పడిన ముద్రను చెరిపేసుకునేందుకు ముస్లిం మైనారిటీవర్గానికి చెందిన వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా తెరమీదకు తెచ్చేఅవకాశాలూ లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఏం చేసినా ముస్లింల ఓట్లు బీజేపీకి పడే అవకాశం లేదు.. అయినా ఇటీవలి పరిణామాలతో  అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన చెడ్డపేరును తొలగించుకునేందుకు రాష్ట్రపతిగా ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిని తెరపైకి తీసుకువచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి దాకా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా వ్యవహరించిన నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఆ పార్టీ , కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టను గంగలో కలిపేశాయి. మసకబారిన ప్రతిష్టను కొంతైనా తిరిగి సంపాదించుకునే ప్రయత్నంలో భాగంగా రాష్ట్రపతి అభ్యర్థిగా  మైనారిటీ అభ్యర్థిని తెరపైకి తెచ్చే అంశాన్ని బీజేపీ అగ్రనాయకత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నదని అంటున్నారు.  అదే కనుక జరిగితే ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేరును అధిష్టానం పరిశీలించే అవకాశం ఉందంటున్నారు. అందుకే నఖ్వీ పేరును  రాజ్యసభకు పరిశీలించలేదని విశ్లేషిస్తున్నారు.  

 అలాగే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఈ సారి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని రంగంలోనికి దింపే అవకాశం ఉందని కూడా పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తికి అవకాశం ఇచ్చే విషయాన్ని బీజేపీ అగ్రనాయకత్వం తీవ్రంగా పరిశీలిస్తోందంటున్నారు. ఎందుకంటే కర్నాటక వినా దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి ఇప్పటివరకూ పట్టు లేదు. ఈ సారి ఎలాగైనా దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయాలన్న పట్టుదలతో ఉన్న కమలనాథులు రాష్ట్రపతి అభ్యర్థిగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని రంగంలోనికి దింపే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

ఇక విపక్షాల నుంచి ఇప్పటి వరకూ ఉమ్మడ అభ్యర్థి ప్రస్తావనే రాలేదు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒకింత ప్రయత్నం చేసినా అది పెద్దగా కలిసి వచ్చినట్లు కనిపించడం లేదు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇప్పటికే కేంద్రం ప్రతిపాదించే రాష్ట్రపతి అభ్యర్థికే మద్దతు ఇస్తాయన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్ననేపథ్యంలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి రంగంలోనికి దిగినా పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశాలు లేవని పరిశీలకులు అంటున్నారు.