విభజన బిల్లుకి రాష్ట్రపతి గడువు పొడిగిస్తారా?



మరో మూడు రోజుల తరువాత రాష్ట్రవిభజన బిల్లుని రాష్ట్రపతికి త్రిప్పిపంపవలసి ఉంటుంది. కానీ, బిల్లుపై సమగ్రంగా చర్చ జరగనందున మరొక నెల రోజులు గడువు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖకు కొద్ది రోజుల క్రితం వ్రాసింది. హోంశాఖ ఆ లేఖను రాష్ట్రపతికి పంపింది, కానీ రాష్ట్రపతి ఇంకా దానిపై స్పందించలేదు. ఒకవేళ ఆయన కనీసం మరో పదిరోజులు గడువయినా పెంచవచ్చనునని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అదే జరిగితే, బిల్లు కేంద్రానికి చేరేసరికి మరింత ఆలస్యమవుతుంది కనుక, ఫిబ్రవరి ఐదు నుండి మోదలయ్యే పార్లమెంటు సమావేశాలలో బిల్లుని ప్రవేశపెట్టకుండా ఆపవచ్చని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు ఆయన సహచరులు భావిస్తున్నారు. కానీ, తెలంగాణా నేతలు బిల్లుపై అసలు చర్చే అవసరం లేదని, అందువల్ల గడువు పెంపు కూడా అనవసరమని, సీమాంధ్ర నేతలు బిల్లును అడ్డుకోవడానికే ఇటువంటి కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రపతి ప్రభుత్వ అభ్యర్ధనను మన్నిస్తారా లేదా? అనే సంగతి నేడో రేపో తెలిపిపోవచ్చును. దానిని బట్టే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాలలో ప్రవేశ పెట్టగలుగుతుందా లేదా అనే సంగతి కూడా స్పష్టమయిపోవచ్చును.