TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీ ముందస్తు ప్రణాళికలు షురూ! ఏపీ సీఈవో మార్పు అందుకేనా?

Published on: Sat May 14, 2022 11:55AM

ధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం తన ముందస్తు ప్రణాళికలను అమలు చేయడం మొదలెట్టేసిందా? అన్న ప్రశ్నకు విశ్లేషకులు ఔననే సమాధానం ఇస్తున్నారు. సీస్ సమీర్ శర్మ పదవీ కాలం పొడగింపు, ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మార్పు ఇందుకేనని వారు విశ్లేషణలు చేస్తున్నారు.

సాధారణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఎన్నికలకు ముందు తనకు అనుకూలమైన అధికారులను కీలక పోస్టులలో నియమిస్తుంది. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తుంది. సీఎస్ సమీర్ శర్మ పదవీ కాలం పొడగింపు కోరుతూ కేంద్రానికి ఏపీ లేఖ రాయడం అందులో భాగంగానే చూడాలి. సీఎస్ పదవీ కాలం పొడగింపు విషయంలో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 31న రిటైర్ కావలసిన ఆయన నవంబర్ వరకూ అదే పదవిలో కొనసాగుతారు.

సీఎం జగన్ మనసెరిగి నడుచుకునే అధికారిగా సమీర్ శర్మ గుర్తింపు పొందారు. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీం కోర్టు తీర్పు తరువాత కూడా పోస్టింగ్ ఇవ్వకుండా, కలవడానికి వచ్చిన ఆయనను వెయిటింగ్ రూంలో ఉంచి మొహం చాటేయడం ద్వారా జగన్ కు నచ్చరనుకున్న వ్యక్తులను కూడా అవాయిడ్ చేయడం ద్వారా ప్రభుత్వానికి అత్యంత అనుకూలంగా పని చేస్తున్న సమీర్ శర్మకు పదవీ కాలం పొడగింపు ఇది రెండో సారి. ఆయన విధేయతకు దక్కిన ప్రతిఫలంగా దీనిని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి విజయానంద్ మార్పును కూడా ముందస్తు కసరత్తులో భాగంగానే చూడాలంటున్నారు. సాధారణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి మార్పు వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించే నిర్ణయం తీసుకుంటుంది. విజయానంద్ మార్పు కూడా అలాగే జరిగిందని అంటున్నారు.  2019 జూన్ లో ఏపీ ఎన్నికల అధికారిగా నియమితులైన విజయానంద్ స్థానంలో ముఖేష్ కుమార్ మీనా నియమితులయ్యారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ముఖేష్ కుమార్ మీనా ఆధ్వర్యంలో జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఓటర్ల జాబితా నుంచి ప్రతిదీ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఇటువంటి ప్రాధాన్యత ఉన్న పోస్టులలో మార్పులూ చేర్పులను సాధారణంగా ఎన్నికల కసరత్తు ప్రారంభానికి ముందుగా చేస్తుంటారు. అందుకే ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి మార్పును రాష్ట్రంలో ముందస్తుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయన్న సంకేతంగానే చూడాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకు చెబుతున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో ముందస్తుకు అవకాశాలున్నాయని సంకేతాలిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు.