TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐఆర్ అంటే అప్పా? ఆయ‌న‌కు పిచ్చా? అన‌మోలిస్ క‌మిటీ అంటే తెలుసా?

Published on: Fri Feb 4, 2022 3:25PM

వాళ్లంతా ప్ర‌భుత్వ ఉద్యోగులు. బాగా చ‌దివి.. ప‌రీక్ష‌ల్లో రాణించి.. ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించిన వారు. దాదాపు అంద‌రూ మేధావులే. చాలామంది లెక్క‌ల మాస్టార్లు కూడా ఉన్నారు. ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీలు చేసిన వారూ త‌క్కువేం కాదు. అలాంటి.. అంతా తెలిసిన వాళ్ల‌కే కొత్త‌గా తిర‌కాసు లెక్క‌లు చెబితే? నీతులు వ‌ల్లేస్తే? ఉద్యోగులు ఊరుకుంటారా? లెక్క‌కు లెక్కా బ‌దులు చెప్ప‌రూ.. అర్థంప‌ర్థంలేని మాట‌ల‌కు.. అర్థ‌మ‌య్యేలా వివ‌ర‌ణ ఇవ్వ‌రూ.. అదే చేస్తున్నారు ప్ర‌భుత్వ ఉద్యోగులు. 

అనమోలిస్ కమిటీ అంటున్న అధికారులకు దానిపై అవగాహన లేనట్టుందని స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండి శ్రీనివాసరావు అన్నారు. వేతన సవరణలో ఒక సీనియర్ ఉద్యోగికి జూనియర్ కన్నా అన్యాయం జరిగితే దానిని పరిష్కరించడానికి ఈ కమిటీ పని చేస్తుందన్నారు. ప్రభుత్వం ఉద్యమాన్ని చంపేందుకు కొన్ని ఎత్తుగడలు వేస్తోందన్నారు. వేతన గణన అనేది అర్ధం కాని బ్రహ్మ పదార్దంలా అధికారులు మార్చేశారన్నారు. ఈ విషయంలో ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషన్‌కు పిచ్చి పట్టిందో.. మాకు పట్టిందో అర్ధం కావడం లేదన్నారు. 

ఐఆర్ అంటే వ‌డ్డీ లేని అప్పు అంటూ సెల‌విచ్చిన సీఎస్ స‌మీర్ శ‌ర్మ‌పైనా సెటైర్లు వేశారు ఉద్యోగ సంఘాల నేత‌లు. మధ్యంతర భృతి-ఐఆర్ ఏ రకంగా రుణంగా కనిపించిందో అధికారులే చెప్పాలన్నారు 
స్టీరింగ్ కమిటీ సభ్యుడు సూర్యనారాయణ. ఐఏఎస్‌లు చదివిన గొప్ప చదువులు తాము చదవక పోయినా ఇది సాధారణ లెక్కలేనని ప్రతీ ఉద్యోగికి తెలుసన్నారు. అనామలిస్ కమిటీ అంటే సాధారణంగా చేయాల్సిన దాని కంటే భిన్నంగా ఉన్నవాటిని పరిష్కరించడానికేనని, దానికి భిన్నంగా ప్రభుత్వం ఆలోచిస్తోందని సూర్యనారాయణ అన్నారు. 

మధ్యంతర భృతి వడ్డీలేని అప్పుగా సీఎస్ లాంటి ఉన్నతాధికారి మాట్లాడటం వితండవాదమని పీఆర్సీ సాధన సమితి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. సీఎం జగన్ చుట్టూ ఉన్న సలహాదారులకు లెక్కలు తెలియవన్నారు. ఉద్యోగులకు మాత్రమే వారి వేతన వివరాలు తెలుస్తాయన్నారు.