TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రయాగ్ రాజ్ నిర్మానుష్యం.. చెప్పుల గుట్టగా మారిన ఆయోధ్య

Published on: Wed Mar 5, 2025 8:16AM

45 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిత్యం భక్త కోటితో కళకళలాడిన ప్రయాగ్ రాజ్ ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. పవిత్ర త్రివేణి సంగమానికి వెళ్లే మార్గాలు ఇప్పుడు బోసిపోయి ఉన్నాయి. మహాకుంభమేళా సందర్భంగా కోట్లాది మంది నిత్యం ప్రయాగ్ రాజ్ లోని పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించిన సంగతి తెలిసిందే. దీంతో 45 రోజుల పాటు జనసంద్రంగా మారిన ప్రయాగ్ రాజ్ ఇప్పుడు వెలవెల పోతోంది.   

ఇప్పుడు త్రివేణి సంగమం వద్ద భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాల తొలగింపు చెత్త తొలగింపు పనులు జరుగుతున్నాయి. ఆ పనులు చేసే వారు వినా అక్కడ మరో నరమానవుడు కనిపించని పరిస్థితి ఉంది.    మహా కుంభమేళాలో 45 రోజుల్లో 66 కోట్లమందికి పైగా పుణ్య స్నానాలు చేసినట్లు అంచనా. అంటే సగటున రోజుకు కోటిన్నర మంది మహాకుంభమేళాకు వచ్చారన్నమాట.  
జనవరి 13వ తేదీతో ప్రారంభమైన మహా కుంభమేళా శివరాత్రి పర్వదినంతో అంటే  ఫిబ్రవరి 26 తో ముగిసింది.  

అలాగే ప్రయాగ్ రాజ్ కు వచ్చిన వారిలో అధికులు అయోధ్య వారణాసిలనూ సందర్శించారు. ముఖ్యంగా అయోధ్య రామమందిరానికి మహా కుంభమేలా జరిగిన రోజులలో భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రవేశం, ఆలయం నుంచి వెలుపలకు వెళ్లే మార్గాలను వేరు వేరుగా మార్చడం ఇప్పుడు అయోధ్య వాసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆయోధ్యలో ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా చెప్పులు దర్శనమిస్తున్నాయి. వాటి తొలగింపు కార్యక్రమం తలకు మించిన భారంగా మారింది. అయోధ్య మునిసిపల్ సిబ్బంది ఈ చెప్పుల తొలగింపునకు నానా యాతనా పడుతున్నారు. పొక్లెయినర్లను ఉపయోయిస్తున్నారు.  ఈ పరిస్థితి తలెత్తడానికి ఆలయ నిబంధనలను మార్చడమే కారణమంటున్నారు స్థానికులు.  

ఆలయ ప్రవేశం, నిష్క్రమణలకు వేరువేరు ద్వారాలు ఏర్పాటు చేశారు. దీంతో ఆలయంలోకి మొదటి గేటు నుంచి ప్రవేశించిన భక్తులు మూడో గేటు నుంచి వెలుపలకు రావాల్సి వచ్చింది. మొదటి గేటులో నుంచి ప్రవేశించేముందు భక్తులు తమ చెప్పులను ఆలయం బయట వదిలివేయాలి. ఇక బాలరాముని దర్శనం చేసుకుని మూడో గేటు నుంచి బయటకు వచ్చిన తరువాత తమ చెప్పులు తీసుకునేందుకు భక్తులు దాదాపు ఐదు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది.  దీంతో దాదాపు అందరు భక్తులూ తమ చెప్పులను వదిలేసి వెళ్లిపోయారు. ఈ కారణంగానే అయోధ్యలో చెప్పుల గుట్టలు పేరుకుపోయాయి. మహా కుంభమేళా జరిగిన రోజులలో అయోధ్యను కోటిన్నర మందికి పైగా దర్శించుకున్నారు.